Jun 14,2023 11:59
  • కోవిన్‌ డేటా లీక్‌పై సెర్ట్‌ ఇన్‌ మౌనం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోవిన్‌ డేటా లీక్‌ వ్యవహారంలో ఇప్పటి వరకూ దర్యాప్తు విషయంపై అతీగతీ లేదు. సైబర్‌ నేరాలకు సంబంధించిన అనుమానస్పద లావాదేవీలు, డేటా లీక్‌ల వ్యవహారాలపై అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ సమగ్ర దర్యాప్తునకు కృషి చేయాల్సిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమెర్జెన్సీ టీం (సెర్ట్‌ - ఇన్‌) మౌనం దాల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సెర్ట్‌్‌ ఇన్‌ అనేది సైబర్‌ సెక్యూరిటీ వ్యవహారాల్లో పౌరులకు అవగాహన కల్పించడం, హ్యాకింగ్‌, డేటా లీక్‌ వంటి వ్యవహారాలు వెలుగులోకి రాగానే దర్యాప్తు చేపట్టి వాస్తవాలు బయటపెట్టడం కోసం ఏర్పాటు చేసిన నోడల్‌ ఏజెన్సీ. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ పరిధిలో పనిచేస్తుంది.
            కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు టీకాలు వేయించుకోవడానికి ప్రజలు తమ వివరాలను కోవిన్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు ఈ డేటానే మొత్తం లీక్‌ అయినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి డేటా లీకేజీ వ్యవహారాలు, హ్యాకింగ్‌ వంటి ఘటనలు జరిగిన వెనువెంటనే సెర్ట్‌ ఇన్‌ రంగంలోకి ప్రవేశించి స్వీయ దర్యాప్తు చేసి తన దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాలను బయటపెడుతుంది. దీనివల్ల అయోమయానికి తెరపడుతుంది. కానీ కోవిన్‌ డేటా లీకేజీ వ్యవహారంలో సెర్ట్‌ ఇన్‌ ఇప్పటి వరకు దర్యాప్తు చేసినట్లుగానీ, ఒక వేళ దర్యాప్తు చేసివుంటే అందులో వెలుగుచూసిన విషయాలను కానీ వెల్లడించలేదు. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు వెలుగులోకి రాగానే ఆధార్‌, పాస్‌పోర్టు నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు హ్యాక్‌కు గురయ్యే వీలుందని సెర్ట్‌ ఇన్‌ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ కోవిన్‌ విషయంలో అలాంటి హెచ్చరికలేవీ రావడం లేదు. కోవిన్‌ పోర్టల్‌లో డేటా ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ కూడా కట్టలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై స్పందించేందుకు మీడియా ప్రతినిధులు సెర్ట్‌ ఇన్‌ అధికారులను సంప్రదించగా వారి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.
 

                                                                     గోప్యత ప్రాథమిక హక్కు

వ్యక్తిగత సమాచారంతో సహా గోప్యత అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని 2017లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లు ఆమోదించకుండా కేంద్రంలోని మోడీ సర్కార్‌ తొక్కిపెడుతూవస్తోంది. సెర్ట్‌ ఇన్‌ నుంచి ఇప్పటి వరకూ ఏదైనా సమాచారం బయటకు వచ్చింది అంటే అది కేవలం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ నుంచే..కోవిన్‌ డేటా లీకేజీ నేపథ్యంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు..డేటా బోట్‌ ద్వారా సమాచారం ఎప్పుడు, ఎక్కడ నుంచి లీక్‌ అయ్యిందనేది స్పష్టత లేదని ఆయన తెలిపారు. అయితే ఈ డేటా కోవిన్‌ నుంచి నేరుగా లీక్‌ కాలేదని, ఒక ఆరోగ్య కార్యకర్త నుంచి లీక్‌ అయ్యిందని క్లౌడ్‌సెక్‌ అనే ప్రయివేటు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. వాస్తవానికి ప్రస్తుతం వెలుగుచూసిన సమాచారం కంటే ఇంకా పెద్ద మొత్తంలోనే లీక్‌ అయ్యింవుంటుందని, కోవిన్‌ పోర్టల్‌ కూడా యాక్సెస్‌ చేయలేనంత సమాచారం లీక్‌ అయ్యివుండే అవకాశముందని సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు కోవిన్‌ పోర్టల్‌ కేవలం పుట్టిన సంవత్సరాన్నే మాత్రమే యాక్సెస్‌ చేయగలదని, కానీ డేటా చోరీకి పాల్పడినవాళ్లు పుట్టిన తేదీతో సహా యాక్సెస్‌ చేయగలరని విశ్లేషించారు.
 

                                                                  పారదర్శక దర్యాప్తు అవసరం

ప్రభుత్వం ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలని, ఏ రంగంలోనైనా ప్రభుత్వ మౌలిక సదుపాయాల పట్ల ప్రజలకు విశ్వసనీయత కలిగించేలా పాదర్శకత అవసరమని సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. డేటా లీకేజీ వ్యవహారంపై సమగ్రమైన పారదర్శకతతో కూడిన దర్యాప్తు చేపట్టాలని న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడమ్‌ లా సెంటర్‌ లీగల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ సుగథన్‌ తెలిపారు. సెర్ట్‌ ఇన్‌ దర్యాప్తు 'పారదర్శక ప్రక్రియ ద్వారా చేపట్టాలి. పౌరులకు సంబంధించిన సాంకేతిక మౌలిక సదుపాయాల పట్ల ప్రజల్లో విశ్వసం పెపొందించేలా ఈ దర్యాప్తు ముందుకు సాగాలి' అని ఆయన కోరారు. కానీ ఈ విశ్వసనీయత కలిగించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డేటా ప్రొటెక్షన్‌ చట్టం ఇంకా ఆమోదం పొందకున్నా..ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం కూడా ప్రభుత్వం చాలా చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. డేటా రక్షణకు ఇప్పటికైనా ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.