Sep 13,2023 22:02

ప్రజాశక్తి - యంత్రాంగం : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు నిరాహార దీక్షలను చేపట్టారు. పలు జిల్లాల్లో నిరాహార దీక్షలను పోలీసులు అడ్డుకుని, నాయకులను అరెస్టు చేశారు. 'బాబు గారికి తోడుగా.. ఒక నియంతపై పోరాటానికి మేము సైతం సిద్ధం' పేరిట విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేసేందుకు టిడిపి నేతలు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. పార్టీ విశాఖ జిల్లా కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టగా తెలుగుదేశం నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ కార్యాలయం ముందు స్టాపర్లు పెట్టి రాకపోకలను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఒకానొక దశలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. ఎంవిపి కాలనీలోని తన ఇంటి వద్ద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దీక్షకు దిగారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో దీక్షలు చేపట్టారు.విజయనగరం ఆర్‌టిస ికాంప్లెక్సు వద్ద నిరాహారదీక్ష చేస్తున్న నాయకులను పోలీసులు ఈడ్చుకు వెళ్లారు. పార్వతీపురంలో 12 మందిని, గజపతినగరంలో టిడిపి నాయకుడు కరణం శివరామకృష్ణను అరెస్టు చేసిఅనంతరం విడుదల చేశారు. తిరుపతిలో టిడిపి లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.