పెనమలూరు (కృష్ణా) : కాల్వలో కారు మునిగింది... వాహన యజమాని దుస్తులు కారులోనే ఉన్నాయి.. కానీ అతడి ఆచూకీ తెలియలేదు.. మిస్టరీగా ఉన్న ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున కఅష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద జరిగింది.
పోలీసుల కథనం మేరకు ... అవనిగడ్డలో నివసిస్తున్న గాజుల రత్నభాస్కర్ (43) బంటుమిల్లి సమీప రామవరపుమూడిలో ఐస్ కోల్డ్ స్టోరేజీ నిర్వహిస్తున్నారు. అతడికి భార్య, కుమార్తె ఉన్నారు. మచిలీపట్నంలో జరుగుతున్న ఓ రాజకీయ పార్టీ సమావేశానికి వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సోమవారం వేకువజామున పెదపులిపాక వంతెన సమీపంలో ఇతని కారు స్థానిక కరవు కాల్వలో పైకప్పు వరకూ మునిగిపోయి ఉండగా హెడ్ లైట్లు వెలుగుతున్నట్లు నీటిలో కనిపించడంతో అటుగా వెళుతున్న ఇసుక లారీ డ్రైవర్ గుర్తించి 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పెనమలూరు ఎస్‌ఐ అర్జున్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. అప్పటికే వాహనం తలుపు తెరచి ఉండగా, జత దుస్తులు డ్రైవర్ సీటు కింద ఉన్నాయి. డాష్‌బోర్డులో పత్రాలను పరిశీలించగా కారు రత్నభాస్కర్‌దిగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మచిలీపట్నంలో సమావేశానికి హాజరైన ఇతను పెదపులిపాక ప్రాంతానికి ఎందుకు వచ్చాడు ? ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక ఏదైనా వ్యూహం ఉందా ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారులో రత్నభాస్కర్ ఒక్కడే ఉన్నారా ? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. అతడి సెల్‌ఫోన్ కాల్‌డేటా కోసం యత్నిస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఇతను మచిలీపట్నంలోనే ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగల్స్ చూపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు నిర్ధారించుకున్నారు. రత్నభాస్కర్ కారు దిగి వెళ్లిపోయారా ? లేక కాల్వలో గల్లంతయ్యారా ? అన్నది మిస్టరీగా మారింది. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.










