Oct 13,2023 08:20

- పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టడమే అభివృద్ధా?
- వ్యవసాయ రంగానికి ప్రధాన శత్రువు మోడీనే
- నవంబర్‌ 7న విజయవాడలో బహిరంగ సభ
- 'వ్యవసాయ రంగ పరిస్థితులు-ప్రత్యామ్నాయ విధానాలు' సదస్సులో వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి:సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని, అందుకు అందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. 'వ్యవసాయ రంగ పరిస్థితులు-ప్రత్యామ్నాయ విధానాలు' అనే అంశంపై కర్నూలు బిఎఎస్‌ కల్యాణమండపంలో గురువారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. తొలుత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌.స్వామినాథన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అస్తవ్యస్తంగా ఉందన్నారు. చావలేక సాగు చేస్తున్నారని, సాగు చేసి చస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని, అందులో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారన్నారు. తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తామని ప్రభుత్వం బాకా ఊదుతోందని, ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టి పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టడమే ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి అని చెప్పారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ వ్యవసాయంగా మార్చేందుకు కుట్ర కొనసాగుతోందని, రైతులు చైతన్యంతో తిప్పికొట్టాలని కోరారు. . భూములను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెడితే దేశానికి తిండి పెట్టేదెవరని ప్రశ్నించారు. మోడీ చట్టాలను రాష్ట్రంలో జగన్‌ సమర్థిస్తూ మళ్లీ రైతులకు జిందాబాద్‌ కొట్టడం రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. వ్యవసాయ రంగానికి ప్రధాన శత్రువు కేంద్రంలోని మోడీ ప్రభుత్వమేనన్నారు. ఆదాయం రెట్టింపు చేస్తామని అప్పులు, ఆత్మహత్యలు రెట్టింపు చేశారని విమర్శించారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా సాయం చేస్తున్నామని చెప్పడం ఎవరిని ఉద్ధరించడానికి అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరను, నీటి వనరులను గ్యారెంటీ చేయాలన్నారు. ఎన్‌డిఎతో ఎందుకు ఉండాల్సి వచ్చిందో పవన్‌ కల్యాణ్‌ ఇంత వరకూ వివరణ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర రాజకీయ ఎజెండాను ప్రజా సమస్యల మీదకు మళ్లించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, బస్సు యాత్రలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం పాటుపడేది కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. నిజమైన వ్యవసాయ ప్రణాళిక తమ దగ్గర ఉందని, దాన్ని ప్రజల ముందు పెట్టేందుకు నవంబర్‌ 7న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఆ సభను జయప్రదం చేయాలని కోరారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనల విధానపత్రాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే కాలంలో రైతుల భవిష్యత్తు కోసం సమరశీల ఉద్యమాలకు రైతులు సిద్ధం కావాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం మోడీ చుట్టూ తిరుగుతున్నాయని, ఆ రాజకీయాలను ప్రజా సమస్యల వైపు మళ్లించేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని, అత్యధికంగా వరిసాగు తగ్గిపోయిందన్నారు. 15 తీర్మానాలను సదస్సులో ఆమోదించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశారు అధ్యక్షత వహించారు. సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల, నంద్యాల జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, అనంతపురం జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు జిల్లా రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటేశులు, జి.రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు బి.రామాంజినేయులు, పిఎస్‌.రాధాకృష్ణ, కెవి.నారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.జగన్నాథం, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు నరసింహులు పాల్గోన్నారు.