Mar 30,2023 12:05

ఐపీఎల్‌ 16వ సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆర్‌సీబీ ఫొటో షూట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన చిట్‌చాట్‌లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కొన్ని విషయాలను వెల్లడించాడు. బోల్డ్‌ డైరీస్‌ పేరిట ఆర్‌సీబీ ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక తన ఆరాధ్య క్రికెటర్లు వివ్‌ రిచర్డ్స్‌, సచిన టెండూల్కర్‌ అని, వాళ్లు క్రికెట్‌ నే మార్చిన ప్లేయర్స్‌ అని కొనియాడాడు. ఇక ఏప్రిల్‌ 2న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌ ద్వారా ఆర్‌సీబీ ఈ సీజన్‌ను ఆరంభించనుంది.

  • అప్పటికప్పుడు అనుకొని కొనుగోలు చేసి.. ఉపయోగించని వస్తువులు ఏవైనా ఉన్నాయా..?

విరాట్‌: హఠాత్తుగా చూడగానే కొనుగోలు చేసిన వాటిల్లో ఎక్కువగా కార్లు ఉండేవి. చాలావరకు అప్పటికప్పుడు కొన్నవే. అయితే వాటిల్లో ప్రయాణించడం చాలా తక్కువ. ఒకానొక సమయంలో ఇది సరికాదని భావించి చాలా కార్లను అమ్మేశా. ఇప్పుడు మాకు అవసరం అనుకున్న వాటిని ఉంచుకుని.. అందులోనే ప్రయాణిస్తున్నాం. ఇదంతా మానసికంగా పరిణతి సాధించడం వల్లే సాధ్యమైంది. ప్రతి విషయంపైనా అవగాహన తెచ్చుకుని పరిణతితో ఆలోచిస్తున్నా.

  • ఒకవేళ క్రిస్టియానో రొనాల్డొ, రోజర్‌ ఫెదరర్‌, నువ్వు ఒకే టేబుల్‌ వద్ద కూర్చుంటే.. మీ మధ్య సంభాషణ దేని గురించి ఉంటుంది..?

విరాట్‌: నేను నిశ్శబ్దంగా కూర్చుని.. వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను. నిజం చెప్పాలంటే ఏం మాట్లాడతానో కూడా తెలియదు. క్రీడా ప్రపంచంలో దిగ్గజ అథ్లెట్లను కలవడం అద్భుతంగా ఉంటుంది. వారి మాటలను విన్నా సరిపోతుంది.