ప్రజాశక్తి ఆచంట ( పశ్చిమగోదావరి జిల్లా) : ఇంట్లో అంతా నిద్రిస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూటయ్యి మంటలు అంటుకొని తాటాకు ఇల్లు దగ్ధమైన ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం కంసాలవారి చెరువు గట్టు కు చెందిన పిచ్చెట్టి సత్యనారాయణ కుటుంబం తమ తాటాకు ఇంటిలో నిద్రిస్తుండగా, అకస్మాత్తుగా షార్ట్‌సర్క్యూటయ్యి ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మంటలను చూసిన స్థానికులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటిలో సామాగ్రి, బట్టలు మొత్తం అగ్నికి ఆహుతవ్వడంతో బాధిత కుటుంబం కట్టుబట్టలతో రోడ్డునపడింది. ఈ సందర్భంగా నన్నేటి ఆనందం సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నన్నేటి పుష్పరాజు బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ జక్కంశెట్టి చంటి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.










