Jul 07,2023 13:08

యాదాద్రి : యాదాద్రి జిల్లాలో శుక్రవారం ఉదయం ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బోగీలో మంటలు చెలరేగి మొత్తం 5 బోగీలకు ఒక్కసారిగా వ్యాపించాయి. ప్రయాణీకులంతా రైలు నుండి కిందికి దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

                                                                            5 బోగీలు దగ్ధం...

తొలుత ఎస్‌ 4, ఎస్‌ 5 బోగీల్లో దట్టమైన పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో రైలును పగిడిపల్లి-బమ్మాయిపల్లి మధ్య ఆపేశారు. భయాందోళనలతో ప్రయాణికులంతా రైలు నుండి కిందికి దిగిపోయారు. ఈ ఘటనలో 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలుకాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది బోగీల మధ్య లింక్‌ను వేరు చేసి, రైలును ముందుకు తీసుకెళ్లారు. రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

012


                                                             రైలులో 1500 మంది ప్రయాణికులున్నారు...

ఈ రైలులో దాదాపు 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫలక్‌ నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరి సమీపంలో రైలు వేగాన్ని తగ్గించడంతో మంటలను గుర్తించారు. ఈ రైలులోని ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6 కోచ్‌లు దగ్ధమైనట్లు సమాచారం.
 

                                         ఘటనా స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌...

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు. ఫలక్‌నుమా ఎక్స్‌ ప్రెస్‌ హరా నుంచి సికింద్రాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో గంటలో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఇతర బోగీలకు వ్యాపించే చోట బోగీల మధ్య ఉన్న లింక్‌ను తొలగించారు. దీంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

2233


                                         ఛార్జింగ్‌ పాయింట్‌ వద్ద సిగరెట్‌ తాగడం వల్లే ప్రమాదం : ప్రత్యక్ష సాక్షి

రైలులో ప్రయాణించిన ఓ ప్రయాణీకుడు మీడియాతో మాట్లాడుతూ ... ఛార్జింగ్‌ పాయింట్‌ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్‌ తాగడం వల్లే మంటలు చెలరేగాయని తెలిపారు.

                                    ఉద్యోగం కోసం వెళుతున్నా.. సర్టిఫికెట్లన్నీ రైలులోనే ఉండిపోయాయి : యువతి

ఓ యువతి మాట్లాడుతూ ... ఉద్యోగం కోసం తాను హైదరాబాద్‌కు వెళుతున్నానని... తన సర్టిఫికెట్లన్నీ రైలులో ఉండిపోయాయని కన్నీరుమున్నీరయ్యింది.