ప్రజాశక్తి - పులివెందుల రూరల్ (కడప) : ఇటీవల ఏలూరులోని సభలో పవన్ కళ్యాణ్ వాలంటరీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ... పులివెందుల రూరల్‌లోని వాలంటీర్లు మంగళవారం నిరసన ర్యాలీని చేపట్టారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ పట్టుకొని పాత బస్టాండ్ నుండి సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి సర్కిల్ వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ... సేవా దృక్పథంతో తాము పనిచేస్తున్నామని, తమపై లేనిపోని ఆరోపణలు చేయడం, వివరాలను వైసిపి నాయకులకు అందజేస్తున్నామని అనడం సబబు కాదన్నారు. కరోనా సమయంలో సొంత మనుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేశామని, ప్రతి నెల ఒకటవ తేదీన తెల్లవారుజామున నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇప్పటికైనా వాలంటరీలకు క్షమాపణలు చెప్పకపోతే ఆందోళన తీవ్రత చేస్తామని హెచ్చరించారు.










