- బాలింతలు, గర్భిణుల ఇళ్లకే సరుకులు
- లక్ష్యానికి తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : మహిళా, శిశుసంక్షేమ శాఖకు ఏటా నిధులను తగ్గిస్తోన్న కేంద్ర ప్రభుత్వం, అందుకనుగుణంగా ఖర్చులనూ తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఇళ్లకే రేషన్ అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వారు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి చిన్నారులతోపాటు భోజనం చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వండిన ఆహార పదార్థాలకు బదులుగా సరుకులనే అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా కోట్లాది రూపాయల ఖర్చును తగ్గించుకోవాలని చూస్తోంది. ఆహార పదార్థాల తయారీ భారం, ఖర్చు బాలింతలు, గర్భిణులపై పడనుంది. వీరిలో పౌష్టికార సమస్య పరిష్కారానికి తీసుకొచ్చిన ఈ పథకం కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో నీరుగారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 257 సమగ్ర శిశుసంక్షేమ అభివృద్ధి (ఐసిడిఎస్) ప్రాజెక్టులు, 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు, 48,770 ప్రధాన కేంద్రాలు, 6,837 మినీ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 32.91 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వారిలో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 15.67 లక్షల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 10.09 లక్షల మంది, గర్భిణులు, బాలింతలు కలిపి సుమారు 7.15 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం వీరందరికీ అంగన్‌వాడీ కేంద్రాల్లో వండిన పదార్థాలనే పెడుతున్నారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ 125 గ్రాముల రైస్, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల మంచి నూనె, ఒక గుడ్డు, 250 గ్రాముల పాలు ఇస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో వంద గ్రాముల పాలు, మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లోలాగానే ఇస్తున్నారు. వీటితోపాటు రాగులు, చెక్కీ, బెల్లం అరకేజీ చొప్పున, ఖర్జూరం 500 గ్రాములు, గోధుమ పిండి రెండు కేజీలు తదితర ఐదు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందిస్తున్నారు.
రూ.1.49 కోట్ల బడ్జెట్ మిగులు
ఆహార పదార్థాల తయారీకి ప్రభుత్వం కేటగిరీల వారీగా కూరగాయలు, వంట చెరకు, పోపుల బిల్లులు, రవాణా ఛార్జీల కింద డబ్బులు చెల్లిస్తోంది. అందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు కూరగాయల కోసం రూ.3, పోపుల కోసం 75 పైసలు, వంట చెరుకు కోసం రూ.1.75, రవాణా ఛార్జీల కింద 27 పైసలు మొత్తం కలిపి ఒక్కొక్కరి కోసం రోజుకు రూ.5.77 వెచ్చిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7.15 లక్షల మందికి వంట కోసం రూ.41,255 ఖర్చవుతోంది. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.1.49 కోట్లు ఖర్చు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం జులై ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్న 'టేక్ హోం రేషన్'లో భాగంగా సరుకులను ఇప్పుడు గర్భిణులు, బాలింతల ఇంటికి తీసుకెళ్లి ఇవ్వనున్నారు. వీటితోవారు ఇంటి వద్ద వంట చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అదనపు ఖర్చు అవడంతోపాటు ప్రయాసకు గురికావాల్సి వస్తుంది. గర్భిణులు, బాలింతలకు సరుకులు ఇస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం, అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వండి పెట్టిస్తోంది. కరోనా కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో టేక్ హోం రేషన్ అమలు చేసినా, కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ అంగన్‌వాడీ కేంద్రాలలోనే వండి పెడుతున్నారు. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చడం వల్ల భార్యాభర్తలు ఇద్దరే ఉన్న చోట వంట చేసుకోవడం గర్భిణులకు, బాలింతలకు కష్టంగా మారనుంది. అత్తామామ ఇతర కుటుంబ సభ్యులుంటే, ఇచ్చిన సరుకులు ఎంతవరకు వీరికే ఉపయోగపడతాయన్నది సందేహమే.










