Jun 11,2023 07:50

పారిస్‌ :  ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్‌, పోలండ్‌కు చెందిన స్వైటెక్‌ 6-2, 5-7, 6-4తో 19వ సీడ్‌ కరోలినా ముఛోవాపై విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా నెగ్గిన స్వైటెక్‌.. రెండో సెట్‌ను ప్రత్యర్ధికి చేజార్చుకుంది. ఇక మూడో సెట్‌లోనూ ఓ దశలో 0-2 పాయింట్లతో వెనుకబడ్డా.. ఆ తర్వాత వరుసగా గేమ్‌ పాయింట్లు సాధిస్తూ విజేతగా నిలిచింది. దీంతో వరుసగా ఏడేళ్ల క్రితం సెరెనా విలియమ్స్‌ తర్వాత వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మహిళగా స్వైటెక్‌ రికార్డు నెలకొల్పింది. విజయం సాధించిన అనంతరం స్వైటెక్‌ మాట్లాడుతూ.. ముఛోవా అద్భుతమైన ప్లేయర్‌. వైవిధ్యమైన ఆటతో ఓ దశలో తనపై ఆధిపత్యం చెలాయించింది. పట్టుదలకు ఆమె మారుపేరు అని పేర్కొంది. ఈ ఏడాది జరిగే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంటే.. హెనిన్‌, క్రిస్‌ ఎవర్ట్‌, స్టెఫీగ్రాఫ్‌, మోనికా సెలెస్‌ వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణుల జాబితాలో చేరనుంది. కెరీర్‌లో 5వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన స్వైటెక్‌.. ఈ టోర్నమెంట్‌లో సబలెంకా, రైబకినా వంటి యువ క్రీడాకారిణుల త్రయంతో నూతన అధ్యాయాన్ని లిఖించనుంది. టైటిల్‌ విజేతగా నిలవడంతో 22ఏళ్ల స్వైటెక్‌ తన టాప్‌సీడ్‌ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంది.
 

                                                                     వీల్‌ఛైర్‌ ఛాంపియన్‌ టొకిటో..

జపాన్‌కు చెందిన టొకిటో ఒడ్డా వీల్‌ఛైర్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో టొకిటో 6-1, 6-4తో బ్రిటన్‌కు చెందిన ఆల్ఫీ హెవిట్‌పై నెగ్గాడు. దీంతో 17ఏళ్లకే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి వీల్‌ఛైర్‌ ఛాంపియన్‌గా జపాన్‌కు చెందిన టొకిటో రికార్డు నెలకొల్పాడు.
 

                                                                         బాలికల ఛాంప్‌ కొర్నీవా..

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బాలికల టైటిల్‌ను రష్యాకు చెందిన 15ఏళ్ల అలీనా కొర్నీవా గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3వ సీడ్‌ కొర్నీవా 7-6(7-4), 6-3తో 6వ సీడ్‌, 18ఏళ్ల లూసియానా పెరేజ్‌ అలెర్నోన్‌పై విజయం సాధించింది. టైటిల్‌ను చేజిక్కించుకొనే క్రమంలో కొర్నీవా కేవలం ఒక్క సెట్‌ను మాత్రమే ప్రత్యర్ధి చేజార్చుకుంది. ఫైనల్లో కొర్నీవా 3ఏస్‌లను సంధించగా.. పరేజ్‌ అలెల్కన్‌ 9డబుల్‌ ఫాల్స్‌ చేసింది. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ బాలికల టైటిల్‌ను గెలిచింది. దీంతో ఒకే ఏడాది రెండు బాలికల గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన బాలికగా కొర్నీవా నిలిచింది.