ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌సామ్ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్, పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్‌తోపాటు స్విటోలినా ప్రవేశించింది. శనివారం జరిగిన మూడోరౌండ్ పోటీలో ఇగా స్వైటెక్ 6-0, 6-0తో వాంగ్(చైనా)పై సునాయాసంగా గెలుపొందగా.. స్విటోలినా 2-6, 6-2, 7-5తో స్ట్రాస్ట్‌బర్గ్(ఉక్రెయిన్)పై పోరాడి నెగ్గింది. తొలి సెట్‌ను కోల్పోయిన స్విటోలినా.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్‌లలో గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ఇక బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకా 6-2, 6-2తో రష్యాకు చెందిన కమిల్లాపై నెగ్గింది. ప్రి క్వార్టర్స్‌లో సబలెంకా యుఎస్ ఓపెన్ మాజీ ఛాంపియన్ స్టెఫెన్స్-కజకిస్తాన్‌కు చెందిన యులి పుటింస్సోవా మ్యాచ్ విజేతతో తలపడనుంది. ఇక 4వ సీడ్ రైబకినా(కజకిస్తాన్) గాయంతో టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో టోర్మో(స్పెయిన్) ప్రి క్వార్టర్స్‌కు చేరారు. ఇక అమెరికా యువ సంచలనం, 6వ సీడ్ కోకా గాఫ్ 6-7(5-7), 6-1, 6-1తో అండ్రేవా(రష్యా)పై నెగ్గారు.
రూనే సునాయాసంగా.. రూఢ్ పోరాడి..
పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ పోటీలో 6వ రూనే(డెన్మార్క్) సునాయాసంగా గెలుపొందగా.. 4వ సీడ్ కాస్పర్ రూఢ్(నార్వే) చెమటోడ్చి నెగ్గారు. మూడోరౌండ్‌లో రూనే 6-4, 6-1, 6-3తో వోలివేరి(అర్జెంటీనా)పై గెలుపొందగా.. రూఢ్ 4-6, 6-4, 6-1, 6-4తో జంగ్(చైనా)పై చెమటోడ్చాడు. మరో ఐదుసెట్ల హోరాహోరీ పోరులో 27వ నిష్లోకా(జపాన్) 3-6, 7-6(10-8), 2-6, 6-3, 6-0తో వైల్డ్(దక్షిణాఫ్రికా)పై నెగ్గాడు.










