Jan 20,2023 16:24

ఇంటర్నెట్‌డెస్క్‌ : స్విగ్గీ కంపెనీ తాజాగా 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టతరమైందని భావిస్తున్నట్లు ఆ కంపెనీ సిఇఓ శ్రీహర్ష మెజెటీ అన్నారు. ఆయన ఈ మేరకు ఉద్యోగులకు శుక్రవారం ఇమెయిల్‌ చేశారు. 'మా జట్టు పరిమాణాన్ని తగ్గించుకోవడానికి మేము చాలా కఠినమైన నిర్ణయాన్ని అమలు చేస్తున్నాము. ఈ నిర్ణయంలో భాగంగానే 380 మంది ప్రతిభావంతులైన స్విగ్‌స్టర్‌లకు వీడ్కోలు పలుకుతున్నాము. ఇంతటి కఠినమైన నిర్ణయానికి వెళ్లాల్సి రావడం నిజంగా చింతిస్తున్నాను' అని ఆయన ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో తెలిపారు.
కాగా, సిఇఓ శ్రీహర్ష ఈ సందర్భంగా కంపెనీ కొత్త వ్యాపారాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. మేము త్వరలోనే మాంసం మార్కెట్‌ను మూసివేయనున్నాము. మా బృందం ఈ వ్యాపారాన్ని లాభాల్లోకి తేవాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే కస్టమర్‌ కోణం నుండి పరిశీలించి ఇన్‌స్టామార్ట్‌ ద్వారా డెలివరీ చేయడాన్ని కొనసాగిస్తాము. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అందులో మేము మినహాయింపు కాదు' అని శ్రీహర్ష తన మెయిల్‌లో తెలిపారు.