Oct 11,2023 21:35

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రజల సంపదని, దానిని అమ్మే హక్కు కేంద్రానికి లేదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే దీక్షలు బుధవారానికి 972వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాలతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కర్మాగారాన్ని మోడీ ప్రభుత్వం తన అనుయాయులకు కట్టబెట్టేందుకు చూస్తోందన్నారు. ఆ ప్రయత్నాలను ఉద్యమాలతో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్లాంట్‌ను నూటికి నూరు శాతం అమ్మాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే రా మెటీరియల్‌ను పూర్తి స్థాయిలో అందించి కర్మాగారాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు గుమ్మడి నరేంద్ర, డి.దేముడు, డి.రమేష్‌, జి.ఆనంద్‌, ఎంకెవి.రాజేశ్వరరావు, వర్మ, మోహన్‌ కుమార్‌, జివి.రమణారావు, సుబ్రమణ్యం, జి.రమేష్‌ పాల్గొన్నారు.