- అవసరంలో సగం కూడాలేని కేటాయింపులు
- రైతన్నల ఎదురుచూపులు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : రైతులకు రోజు రోజుకూ రాయితీ విత్తనం అందని ద్రాక్షగా మారిపోతోంది. తక్కువగా సాగయ్యే పంటల విత్తనాలకే రాయితీ అందిస్తున్నారు. అవీ, నాణ్యతగా ఉండడం లేదు. అవసరం మేరకు ఇవ్వడం లేదు. దీంతో, రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాకు 35,188 క్వింటాళ్ల వేరుశనగ అవసరం కాగా, 15,905 క్వింటాళ్లను మాత్రమే కేటాయించారు. వాటిలోనూ ఇప్పటి వరకూ 8,295.90 క్వింటాళ్ల రాయితీ విత్తన వేరుశనగ జిల్లాకు చేరింది. జిల్లాకు 1633.1 క్వింటాళ్ల కందులు అవసరం. 1,080 క్వింటాళ్లను మాత్రమే కేటాయించారు. 37.8 క్వింటాళ్ల మినుము విత్తనాలు అవసరం. 25 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. 16 క్వింటాళ్ల పెసర అవసరం. ఐదు క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. కొర్ర విత్తనాలు 133.2 క్వింటాళ్లు అవసరం. 15 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. పిల్లిపెసర 216.7 క్వింటాళ్లు అవసరం. 191 క్వింటాళ్లు కేటాయించారు. అందులో 15.36 క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి.
గతేడాదీ బయట మార్కెట్‌లోనే..
ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు లక్షల మంది వేరుశనగ సాగు చేస్తున్నారు. 25 వేల మందికి మాత్రమే రాయితీ విత్తనాలు అందాయి. మిగిలిన వారంతా గత ఖరీఫ్‌లో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం దాదాపు రూ.80 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఉమ్మడి జిల్లాకు వేరుశనగ, కందులు, జీలుగ, పిల్లి పెసర, కొర్రలు, పెసలు అన్ని విత్తనాలు కలిపి 91,970 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రతిపాదనలు పంపారు. 35,087 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. పత్తి, మిరప, ఉల్లి, మొక్కజొన్న తదితర ఎంపిఆర్ ధరలకు విక్రయించే నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ కూడా అంతంత మాత్రమే జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీకి ప్రభుత్వం పలు కంపెనీలతో ఎంఒయు కుదుర్చుకున్నప్పటికీ సకాలంలో రైతులకు అందించలేదు. ఈ రెండు జిల్లాల పరిధిలో పత్తి సాధారణ సాగు 7.5 లక్షల ఎకరాలు. 22 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 835 ప్యాకెట్ల పత్తి విత్తనాలు, 110 మిరప, 45 క్వింటాళ్ల సోయాబీన్, 279 ప్యాకెట్ల కాకర విత్తనాలు మాత్రమే అందించారు.

అవసరానికి తగినట్టు కేటాయించాలి
రాయితీ విత్తనాలు నామమాత్రంగా వస్తున్నాయి. అవి కూడా దాదాపు బయట మార్కెట్ ధరకే అందుతున్నాయి. రైతులకు అవసరమైన విత్తనాలు అందించడం లేదు. ఇచ్చినవి కూడా నాణ్యత లేకుండా ఉండడంతో ఉపయోగిం చేందుకు వీలులేకుండా పోతోంది. అవసరానికి తగినట్టు నాణ్యమైన విత్తనాలను రాయితీపై ఇవ్వాలి.
- జి.రామకృష్ణ, రైతు సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి










