Jun 17,2023 22:01
  • ప్రపంచ టూర్‌ సూపర్‌1000 ఫైనల్‌కు తొలిసారి
  • సింగిల్స్‌లో ప్రణయ్ రాయ్ ఓటమి

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ా1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ రికార్డు నెలకొల్పింది. ఫైనల్‌కు దూసుకెళ్లి సంచలనం నమోదు చేసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ హోరాహోరీ సెమీస్‌ పోరులో ఎం.హెచ్‌. కాంగ్‌-ఎస్‌.జే. సియో(దక్షిణ కొరియా) జోడీపై 17-21, 21-19, 21-18 తేడాతో గెలుపొంది టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. ఈ క్రమంలో సూపర్‌ా1000 టోర్నమెంట్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు సృష్టించారు. క్వార్టర్స్‌లో 21-13, 21-13 తేడాతో టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్ఫియాన్‌-మహమ్మద్‌ రియాన్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణరుకు నిరాశే ఎదురైంది. టాప్‌ సీడ్‌ అక్సెల్సెన్‌(డెన్మార్క్‌)తో జరిగిన సెమీస్‌లో 21-15, 21-15 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అక్సెల్సెన్‌ ఫైనల్‌లో లీ షిఫెంగ్‌(చైనా)ాఆంథోనీ సినిసుకా గింటింగ్‌(ఇండోనేసియా) మ్యాచ్‌ విజేతతో టైటిల్‌కై తలపడనున్నాడు. ప్రణరు క్వార్టర్స్‌లో 21-18, 21-16 తేడాతో మూడో సీడ్‌ కొడారు నరోకా(జపాన్‌)పై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌లో, మహిళల సింగిల్స్‌లో పివి సింధు రెండో రౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. ఇక మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి స్పెయిన్‌కు చెందిన 6వ సీడ్‌ కరోలినా మారిన్‌, 4వ సీడ్‌ చైనాకు చెందిన చెన్‌-యుఫీ ప్రవేశించారు. మారిన్‌ 21-12, 21-11తో 8వ సీడ్‌ ఇంటనాన్‌(థారులాండ్‌), చెన్‌-యుఫీ 21-8, 21-17తో 2వ సీడ్‌, కొరియాకు చెందిన అన్‌ాసోయంగ్‌లను ఓడించారు.