ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రెడెంట్ లైఫ్ సైన్సెస్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు సిబిఐ స్పెషల్ కోర్టులో వెల్లడించారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు సైతం ఇదివరకే అప్రూవర్‌గా మారారు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ చుట్టూ ఇడి ఉచ్చు మరింత బిగిస్తోంది. హైదరాబాద్ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాగ్మూలంతో ముఖ్యంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఈ కేసులో కవితను సాక్షిగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ... ఇటీవల దాఖలు చేసిన 4వ చార్జ్‌షీట్‌లో కవితతో నిందితులకు ఉన్న సంబంధాలను వెల్లడించింది. కాగా, లిక్కర్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద గతేడాది నవంబరు 11న శరత్ చంద్రారెడ్డిని ఇడి అరెస్టు చేసింది. అప్పటి నుంచి శరత్ చంద్రారెడ్డి తీహార్ జైల్లో ఉన్నారు. ఇటీవల తన భార్య అనారోగ్యం కారణంగా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
శరత్ చంద్రారెడ్డి కీలకం
సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో దారిమళ్లించిన రూ.100 కోట్ల వెనక శరత్ చంద్రారెడ్డి కీలకపాత్ర పోషించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇడి ఆరోపిస్తున్నాయి. మొత్తం రూ.100 కోట్లలో రూ.64 కోట్లను శరత్ తన భార్య కనికా రెడ్డి సహాయంతో చార్టెడ్ ఫ్లయిట్ ద్వారా గోవా ఎన్నికలకు మళ్లించినట్లు ఇడి పేర్కొంది. ముఖ్యంగా ఎల్ 1, పలు లిక్కర్ జోన్లను దక్కించుకునేందుకు శరత్ చంద్రారెడ్డి కంపెనీల నుంచి నిధులు మళ్లించినట్లు ఆరోపిస్తోంది. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లు, డబ్బు లావాదేవీల కోసం కొన్ని కంపెనీలను ఎంగేజ్ చేసినట్లు గత చార్జ్‌షీట్లలో ప్రస్తావించింది. అంతే కాకుండా కవితతో కలిసి శరత్ చంద్రా రెడ్డి ఢిల్లీ, హైదరాబాద్ హోటల్స్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గన్నట్లు పేర్కొంది. ఆప్ నేత విజరు నాయర్‌తో పలుమార్లు ఈ చర్చలు జరిగిన తర్వాతే శరత్ చంద్రారెడ్డి ట్రాన్స్ క్షన్స్ చేసిన్లట్లు కోర్టుకు తెలిపింది. కేవలం తాము బినామీని మాత్రమే అని ఇటీవల పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్, కవిత తరపున సౌత్ గ్రూప్‌కు ప్రతినిధిగా వ్యవహరించానని బుచ్చిబాబు, గ్రూప్ సభ్యుల ఆదేశాల మేరకే డబ్బుల ట్రాన్స్‌క్షన్ చేసినట్లు శరత్ చంద్రరెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ప్రస్తుతం గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో... అసలు ఈ స్కాంలో సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోషించిన వారి పేరు వెల్లడయ్యే అవకాశం ఉంది.










