న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు హెచ్చరిక దెబ్బకు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఛైర్మన్ అజరు సింగ్ దిగివచ్చి.. క్రెడిట్ సూస్సెకు దాదాపు రూ.12 వాయిదా బకాయిలు చెల్లించారు. ఈ నెల 22లోగా యూరోపియన్ బ్యాంక్ క్రెడిట్ సూస్సెకు 5,00,000 డాలర్ల వాయిదా మొత్తం సహా డిఫాల్ట్ అయినా 10 లక్షల డాలర్లు (రెండూ కలిపి దాదాపు రూ.12 కోట్లు) చెల్లించాలని ఈ నెల 11న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. లేదంటే తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అజరు సింగ్‌ను హెచ్చరించింది. దీంతో గురువారం ఆ సంస్థ 1.5 మిలియన్ డాలర్లు క్రెడిట్ సూస్సెకు చెల్లించింది. 2015 నుంచి క్రెడిట్ సూస్సె, స్పైస్‌జెట్ మధ్య న్యాయ వివాదం కొనసాగుతోంది. స్సైస్‌జెట్ తమకు 24 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.200 కోట్లు) బకాయిలు చెల్లించాల్సి ఉందని క్రెడిట్ సూస్సె ప్రకటించింది. గతేడాది ఆగస్టులో ఇరు పక్షాలు వివాద పరిష్కారానికి అంగీకారానికి వచ్చినప్పటికీ ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కూడా స్పైస్‌జెట్ బకాయిలు చెల్లించలేదు. దీంతో క్రెడిట్ సూస్సె మళ్లీ సుప్రీంను ఆశ్రయించగా.. తీవ్ర హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే.










