హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలనేతలు పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, బిజెపి ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు. మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపధ్యంలో మునుగోడులో శనివారం పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేశారు. అదే రోజున మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతల పాదయాత్రలు కూడా జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్ పర్యటించనున్నారు. మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్ సభ ఉండగా, అదే రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 175 మంది కాంగ్రెస్ దిగ్గజాలు నియోజకవర్గానికి రానున్నారు.
సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , షబ్బీర్ అలీ వంటి నేతలు ఒక్కో గ్రామానికి ఒకరు చొప్పున చేరుకుని కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నారు. సీఎం సభ రోజు ఇబ్బందే అని తొలుత అనుకున్నా, ఢ అంటే ఢ అనే రీతిలో ఉండాలంటే అదే రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ క్యాడర్ ఎంత మంది కలిసివస్తారో తెలిసిపోతుందని నాయకులు నిర్ణయించినట్లు తెలిసింది.
పీసీసీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించగా, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ పాల్గని 20న కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.










