Oct 17,2023 16:30

హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌, మునుగోడు ఉపఎన్నికలను దేశ ప్రజలంతా చూశారని, అక్కడ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వైన్స్‌ దుకాణాల్లో ప్రతి నెల రూ.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవని, కానీ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో 20 రోజుల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్‌ మందు పంచలేదు, పైసలూ ఇవ్వలేదన్నారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా, మద్యం పోయకుండా ముందుకు సాగుదామని తాను కేసీఆర్‌కు సవాల్‌ చేశానని, ఆయనను అమరవీరుల స్థూపం వద్దకు రావాలని చెప్పానని అన్నారు. మంచి సంప్రదాయాన్ని అందిద్దామనే ఉద్దేశ్యంతో ఆయనను అమరవీరుల స్థూపం వద్దకు ఆహ్వానిస్తే ఆయన రాలేదన్నారు. తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తానంటే పోలీసులు తనను నిర్బంధించారన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? అన్నది నిరూపించాలన్నారు. కేసీఆర్‌ మాయ చేసి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ నమ్ముకున్నది ప్రజలను కాదని మద్యాన్ని, డబ్బును నమ్ముకున్నారన్నారు. కాబట్టి నిరుద్యోగులే కథానాయకులై, మీరు కదనరంగంలోకి దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తీసుకు రావాలన్నారు. ఆ తర్వాత ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందన్నారు. రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఓయు, కేయు విద్యార్థులు రంగంలోకి దిగితేనే తెలంగాణ వచ్చిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ శక్తిని తక్కువగా అంచనా వేయవద్దన్నారు. అందుకే ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగి ముందుకు రావాలన్నారు.