Oct 01,2023 17:05

హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ఉద్యమిస్తూనే ఉన్నామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ..'' టీఎస్పీఎస్సీని ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుంది. రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించారు. గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్‌-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారు? పేపర్‌ లీకేజీ జరిగినప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత నియామకాలు లేవు. ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్‌ కాదా? అవకతవకలపై ఐటీ మంత్రినని చెప్పుకుంటున్న కమీషన్ల తారక రామారావు ఏం సమాధానం చెబుతారు? అయ్యకు కాళేశ్వరం.. కొడుక్కు టీఎస్పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎంగా మారాయి.
టీఎస్పీఎస్సీ అవకతవకల మూలాలు సీఎంవో అధికారులు రాజశేఖర్‌రెడ్డి, లింగారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు. బోర్డును రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిన బాధ్యత సీఎంపై లేదా? టీఎస్పీఎస్సీ పరిణామాలపై సీఎం కేసీఆర్‌ ఎందుకు సమీక్ష చేయలేదు? ఈ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయింది. త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్‌... నిరుద్యోగులను పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నియామకాలు చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కోదండరాం నేతఅత్వంలో ముందుండి తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. తుది దశ తెలంగాణ ఉద్యమం తెలంగాణకు శాశ్వత పరిష్కారం చూపుతుంది'' అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.