Sep 21,2023 21:51

న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్‌ రంగంలో నగదు లభ్యత తగ్గింది. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు, జిఎస్‌టి పేమెంట్స్‌ వల్ల సెప్టెంబర్‌ 20 నాటికి బ్యాంక్‌ల్లో నగదు లోటు రూ.1.46 లక్షల కోట్లకు పెరిగిందని రాయిటర్స్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ లోటు నాలుగేళ్ల గరిష్ట స్థాయి అని పేర్కొంది. 2019 ఏప్రిల్‌ 23 తర్వాత ఒకే రోజులో ఇదే అత్యధిక కొరత. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్ట్‌లో తొలిసారి బ్యాంకింగ్‌ సిస్టమ్‌ లిక్విడిటీ లోటులోకి జారుకుంది. బ్యాంక్‌ డిపాజిట్లలో 10 శాతం నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్‌)కు కేటాయించాలని ఆర్‌బిఐ సూచిస్తున్నప్పటికీ నగదు లభ్యత తగ్గిపోవడం గమనార్హం. లిక్విడిటీ అంటే అందుబాటులో ఉన్న నగదు లభ్యత. బ్యాంకుల స్వల్పకాలిక వ్యాపారం, ఆర్థిక అవసరాలను ఇది తీర్చుతుంది.