Mar 02,2023 18:34

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం వైసిపి గృహసారథులు, సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. నిబంధనల మేరకు పాఠశాల జరిగే సమయంలో ఎలాంటి రాజకీయ సమావేశం నిర్వహించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.కానీ, ఇందుకు భిన్నంగా ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల జరిగే వేళలో వైసిపి రాజకీయ సమావేశం ఏర్పాటు చేయడం, దీనికి ముఖ్య అతిథిగా మంత్రి అంబటి రాంబాబు విచ్చేసి పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు 734 మంది ఉన్నారు. వీరిలో పదో తరగతి విద్యార్థులు 154 మంది ఉన్నారు. వీరంతా పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో మైక్‌లు పెట్టి రాజకీయ ప్రసంగాలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పార్టీల నుంచి విమర్శలచ్చాయి. పాఠశాలలో వైసిపి రాజకీయ సమావేశం నిర్వహణకు అధికారికంగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని పాఠశాల హెచ్‌ఎం రమేశ్‌, సత్తెనపల్లి ఉపవిద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.