ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్) : ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో మైలవరం పంచాయితీ కార్యాలయం కూడలి వద్ద ఎన్‌టిఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. అనంతరం పట్టణ పురవీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి సిఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడతూ.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరాచకం రాజ్యమేలుతుందని విమర్శించారు. ఇష్టారాజ్య నిర్ణయాలతో ప్రజాగ్రహానికి గురై త్వరలోనే వైసిపి ప్రభుత్వం కనుమరుగౌతుందని దేవినేని జోస్యం చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ మహనీయుని పేరు యూనివర్సిటీకి పెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










