- 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారుకు యత్నించిన కేసులో చార్జిషీట్ ఖరారు
- నేడు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆయనపై ఇలా అభియోగాలు నమోదు కావడం కేవలం నాలుగు మాసాల్లో మూడోసారి. దీంతో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో తలపడాలనే ట్రంప్ ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. అధ్యక్షుడు జో బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా కాంగ్రెస్‌ను నిలువరించడం ద్వారా అమెరికాను మోసగించడానికి ట్రంప్ కుట్ర పన్నారని, అలాగే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా అడ్డుపడ్డారని ఆరోపణలు నమోదయ్యాయి. గురువారం ఫెడరల్ కోర్టుకు హాజరు కావాల్సిందిగా ట్రంప్‌ను ఆదేశించారు. ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలపై స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్ దర్యాప్తు నేపథ్యంలో ఈ అభియోగాలు నమోదయ్యాయి. ఆనాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనా ట్రంప్ ఫలితాలను తారుమారు చేసేందుకు మరో ఆరుగురితో కలిసి కుట్ర పన్నారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఆ ఆరుగురి పేర్లను పేర్కొనలేదు. కానీ వారిలో ఒకరు మాజీ న్యాయ శాఖ అధికారి జెఫరీ క్లార్ అని భావిస్తున్నారు. ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని చేస్తున్న వాదన నిజం కాదని ట్రంప్‌కు కూడా తెలుసునని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయినా సరే ఎన్నికల యంత్రాంగం పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా, ప్రజల్లో ఆగ్రహం, అపనమ్మకం కలిగేలా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాలనుకుని పదే పదే తప్పుడు ఆరోపణలు చేశారని వారు తెలిపారు.
కాగా, ట్రంప్ ఎల్లప్పుడూ చట్టానికి అనుగుణంగానే నడుచు కున్నారని ట్రంప్ ప్రచార బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. నాజీల పాలనను తలపించేలా ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని వారు విమర్శించారు. ఓటింగ్‌లో విస్తృతంగా అవకతవకలు జరిగాయన్న తప్పుడు ఆరోపణల ఆధారంగా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకువచ్చారని అధికారులు కూడా విచారణా కమిటీ ముందు సాక్ష్యమిచ్చారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మొదటి మాజీ అధ్యక్షుడుగా ట్రంప్ ఇప్పటికే నిలిచారు.










