వాషింగ్టన్ : శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న ట్రంప్.. మంగళవారం మన్‌హాటన్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత తన మద్దతుదారులతో మాట్లాడుతూ ... అదే తాను చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. స్టార్మీ డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న ట్రంప్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని న్యూయార్క్ మన్‌హటన్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన 34 నేరాభియోగాలను న్యాయమూర్తి చదివి వినిపించారు. అయితే వాటన్నిటినీ ట్రంప్ కొట్టిపారేశారు.
ట్రంప్ వ్యాఖ్యలు...
'' అమెరికాలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనుకునే వారి నుంచి ధైర్యంగా రక్షించుకోవడమే నేను చేసిన తప్పు. మనం అమెరికా చరిత్రలోనే అత్యంత చీకటి గడియల్లో జీవిస్తున్నాం. మన దేశం నరకంగా మారుతోంది. ఈ దేశం క్షీణదశలో ఉంది. ఇప్పటికే ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ, వలసల విషయంలో మన నిర్ణయాలు నవ్వులపాలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న అతివాద వామపక్షాలు (రాడికల్ లెఫ్ట్) ఎట్టిపరిస్థితుల్లో నన్ను అణచివేయాలని చూస్తున్నారు. వారు ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు. వాటిని మేం అడ్డుకుంటాం. అమెరికాను మళ్లీ ఉన్నతంగా మారుస్తాం '' అంటూ డెమోక్రాట్లు, బైడెన్‌పై విమర్శలు గుప్పించారు.










