- న్యూయార్క్ అటార్నీ జనరల్‌తో భేటీ
వాషింగ్టన్ : తన కంపెనీ వ్యాపార పద్దతులపై న్యూయార్క్ అటార్నీ జనరల్‌తో సాగుతున్న న్యాయ పోరాటంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం దాదాపు ఏడు గంటలకు పైగా సమాధానాలు చెప్పారు. గతేడాది ట్రంప్‌పై న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ దావా వేశారు. హౌటళ్ళు, గోల్ఫ్ కోర్సులు ఇలా మొత్తంగా తన నికర ఆస్తుల విలువ గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా బ్యాంకులను, బిజినెస్ అసోసియేట్లను ట్రంప్, ఆయన కుటుంబం మోసం చేసిందని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో తాను దాచిపెట్టాల్సింది ఏమీ లేదని ట్రంప్ భావిస్తున్నారని ట్రంప్ తరపు అటాన్నీ అలినా హబ్బా చెప్పారు. అందువల్లే సాక్ష్యమివ్వడానికి ఆయన చాలా ఆత్రుతపడుతున్నారని వ్యాఖ్యానించారు. కోట్లాది డాలర్ల విలువైన కంపెనీని విజయపథం వైపు నడిపించేందుకు చేసిన కృషి గురించి కూడా ట్రంప్, అటార్నీ జనరల్‌కి వివరించారు. అసలు తనపై వేసిన ఈ కేసే చాలా హాస్యాస్పదంగా వుందని గురువారం ఉదయం సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ పెట్టారు. తనపై వచ్చిన ఇతర కేసుల మాదిరిగానే ఇది కూడా అర్ధం లేని కేసని విమర్శించారు. ట్రంప్ సాక్ష్యమివ్వడం ఇది రెండోసారి, గతంలో ఆగస్టు 10న ట్రంప్, అటార్నీ జనరల్ జేమ్స్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జేమ్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ట్రంప్ తిరస్కరించారు. తన ఫిప్త్ అమెండ్‌మెంట్ ప్రొటెక్షన్ హక్కుల గురించి 400సార్లకు పైగా ప్రస్తావించారు. ఈసారి ఏడు గంటలకు పైగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.










