ప్రజాశక్తి స్పోర్ట్స్ డెస్క్ : వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ తన తదుపరి లక్ష్యం ఒలింపిక్ బెర్త్ సాధించడమేనని పేర్కొంది. మహిళల 50కిలోల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన నిఖత్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. 'వరుసగా రెండోసారి ప్రపంచ టైటిల్‌ను సాధించడం గొప్ప అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చిందని, ముఖ్యంగా ఒలింపిక్స్ కేటగిరీ అయిన 50కిలోల విభాగంలో సీడింగ్ దక్కేందుకు మరో ఆరు బౌట్‌లలో విజయం సాధించాల్సి ఉందని వెల్లడించింది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌తోపాటు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలకు అర్హత సాధించడమే తన ముందున్న లక్ష్యాలని తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత అత్యంత కఠినమైన పోటీల్లో ఇది ఒకటని, ఈ టోర్నీలో అన్ని దేశాలనుంచి బాక్సర్లు పోటీపడ్డారని, బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లు జరగడంతో శరీరం అలసిపోపోవడంతో పాటు దృఢంగా తయారైందని పేర్కొంది. ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తాను బలంగా తయారవ్వడానికి దోహదపడిందని వెల్లడించింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు జరగనున్న దృష్ట్యా తనపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారని, వారి ఆశలను వమ్ము చేయనని, ఆసియా క్రీడలకు అర్హత సాధించేందుకు మరింత కష్టపడతానని పేర్కొంది. గత ఏడాది 52కిలోల విభాగంలో బరిలోకి దిగిన తాను 3, 4 కిలోలు బరువు తగ్గేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని, అలాగే 50కిలోల బరువును నిలకడగా ఉంచుకొనేందుకు ఎంతో కష్టపడుతున్నా'నని పేర్కొంది. ఇక ప్రపంచకప్ బాక్సింగ్ విభాగంలో మేరీకోమ్(ఆరు స్వర్ణాలు) తర్వాత రెండు స్వర్ణాలు గెలిచిన ఏకైక బాక్సర్ హైదరాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ మాత్రమే. గత ఏడాది 52కిలోల విభాగంలో స్వర్ణం నెగ్గిన నిఖత్.. తాజాగా జరిగిన ప్రపంచకప్ బాక్సింగ్‌లో 50కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక 75లోల విభాగంలో 2018, 2019లో కాంస్య పతకాలను నెగ్గిన లౌలీనా బోర్గోహైన్ ఈసారి స్వర్ణ పతకం సాధించింది.

- అజయ్ సింగ్ హర్షం..
న్యూఢిల్లీ వేదికగా జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు దక్కడం పట్ల భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షులు అజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్ కోటాలను సాధించేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని, నిఖత్ జరీన్‌తోపాటు లౌలీనా బోర్గోహైన్ ఇప్పటికే ఆసియా క్రీడలకు అర్హత సాధించరని, అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందన్నారు. వీరిద్దరూ ఒలింపిక్స్ బెర్త్‌లను సాధించడమే వారి ముందున్న తదుపరి లక్ష్యాలని పేర్కొన్నారు. ఈ టోర్నీలో భారత బాక్సర్ల ప్రదర్శన చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. అలాగే నీతు, స్వీటీ, లౌలీనా ప్రదర్శనలను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. మహిళల ప్రపంచకప్ బాక్సింగ్ విభాగంలో ఘంగాస్(48కిలోలు), నిఖత్(50కిలోలు), లౌలీనా బోర్గోహైన్(75కిలోలు), స్వీటీ బూర(81కిలోలు) స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసిందే.










