బడి వదిలి గంట అయినా ఇంకా ఇంటికి రాని కొడుకు కోసం వాకిట్లో నిలబడి చూస్తోంది కీర్తన.
ఆమె కొడుకు సుధీర్ మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఇంటికి మూడు వీధుల అవతల ఉంది. రోజూ బడి బెల్ కొట్టాక ఓ గంట స్కూల్ దగ్గర మిత్రులతో ఆడుకుని, ఒక్కడే ఇంటికి వచ్చేసేవాడు. ఆ రోజు ఒకటిన్నర గంట అయినా రాలేదని అప్పటిదాకా ఎదురుచూసి.. ఇక లాభం లేదని స్కూల్‌కి బయలుదేరింది కాస్త ఆందోళనగా. రెండు అడుగులు వేసిందో లేదో కాస్త దూరం నుంచి సుధీర్ వస్తూ కనిపించాడు.
'హమ్మయ్యా!' అని స్థిమితపడింది కీర్తన. కానీ సుధీర్ కుంటుతూ రావడంతో..
'అయ్యో.. ఏంటి నాన్నా కుంటుతున్నావు? కాళ్ళకి చెప్పులు ఏవి? ఈ రోజు బూట్లు వద్దని, కొత్త చెప్పులు వేసుకుని వెళ్లావుగా స్కూల్‌కి. అప్పుడే పోగొట్టేశావా?' అంటూ సుధీర్‌ని ఎత్తుకుని, ఇంట్లోకి తీసుకొచ్చింది ఆమె.
'అమ్మా.. మరేమో నేను స్కూల్ అవగానే ఆడుకుని ఇంటికి వస్తూంటే దారిలో ఒక అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేతే.. వాళ్ళ అమ్మ తనను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్ళిందని, ఆకలిగా ఉందని చెప్పాడు అమ్మా ...అందుకని' చెప్పడం ఆపాడు సుధీర్.
'అందుకని నువ్వు ఏం చేశావు?' ఆసక్తిగా అడిగింది కీర్తన.
నువ్వు నాకు సాయంత్రం తినడానికి ఏమైనా కొనుక్కో అని ఇచ్చిన పది రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చాను అమ్మా. అక్కడే ఉన్న ఓ అంగడిలో బిస్కెట్స్ కొనుక్కుని తిన్నాడు ఆ అబ్బాయి' అన్నాడు సుధీర్.
'మంచిపని చేసావు. కానీ ఇంత ఆలస్యంగా ఇంటికి వచ్చావు ఎందుకు? నేను చాలా కంగారుపడ్డాను. ఎందుకు కుంటుతున్నావు కాలు చూపించు. చెప్పులు ఎందుకు వదిలేసావు?' అడిగింది కీర్తన.
'మరే.. అమ్మా.. ఆ అబ్బాయి వాళ్ళమ్మ వచ్చేవరకు అతనితో కలిసి నేను ఆడుకున్నాను. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలట. పాపం ఆ అబ్బాయికి చెప్పులు లేవు. ఎండలో చాలా దూరం తిరిగి, కాళ్ళు మంట అని చెప్పాడు. అందుకని నా చెప్పులు ఆ అబ్బాయికి ఇచ్చేశాను. వాళ్ళమ్మ వచ్చాక నన్ను చాలా మెచ్చుకుంది. వాళ్ళు చాలా బీదవాళ్ళట. ''దేవుడు నిన్ను చల్లగా చూడాలి'' అన్నది వాళ్లమ్మ. అమ్మా నేను చేసింది తప్పా?' చిన్నారి సుధీర్ అడిగిన తీరుకి మనసులోనే పొంగిపోతూ 'లేదు నాన్నా నువ్వు చేసింది చాలా మంచిపని' అంది.
ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది మొలకెత్తడానికి గాలి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో, అలాగే ఒక మనిషిలో మానవత్వం పరిమళించడానికి జాలి, దయ, కరుణ అనే విత్తనాలు ఆ మనిషి పసివాడుగా ఉన్నపుడే వారి మనసులో నాటుకునేలా చేయాలి. అప్పుడు అవి పెరిగి పెద్దయ్యే కొద్దీ పలువురికీ మానవత్వపు పరిమళాలను పంచిపెడతాయి. తాను సుధీర్‌లో నాటిన ఈ జాలి, దయ, కరుణ అనే విత్తనాలు మొలకెత్తి, వికసించి, మానవత్వపు పరిమళాలను వెదజల్లడం చూసి కీర్తన తల్లిగా పొంగిపోయింది.
'అమ్మా.. కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తే మనకు మంచి జరుగుతుందన్నావుగా నువ్వు. మరి నేను ఆ అబ్బాయికి సాయం చేస్తే నాకెందుకమ్మా ముల్లు గుచ్చుకుంది?' అమాయకంగా అడిగాడు సుధీర్.
కీర్తన అతని అరికాలిలో ఉన్న చిన్నముల్లుని తీయడానికి ప్రయత్నిస్తూ.. 'అదే నాన్న, మనం సాయం చేసేటప్పుడు మనకి కొన్ని కష్టాలు, నష్టాలు రావచ్చు. లేదా ఎవరైనా మనను తప్పు పట్టవచ్చు. సాయం చేయనీయకుండా అడ్డుకోవచ్చు. వాటన్నింటినీ పట్టించుకోకుండా ఉన్నపుడే మనం సాయం చేయగలుగుతామని నీకు తెలియడానికే ఆ ముల్లు గుచ్చుకుంది. ఇప్పుడు కష్టం వచ్చిందని సాయం చేయడం మనం ఆపకూడదు. అర్థమైందా?' అంది కీర్తన చిన్న ముల్లును సుధీర్ కాలి నుంచి నేర్పుగా బయటకు తీసి.
రోహిణి వంజరి
9000594630