ప్రజాశక్తి-అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఐదు నిమిషాల ముందే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ లోకేష్‌కు ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో లోకేష్ ఏ14గా ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్‌ను అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణ సమయంలో లోకేష్‌తో పాటు ఆయన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు, లోకేష్ విచారణ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.










