- కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రజాశక్తి-బొబ్బిలి(విజయనగరం) : ప్రతిపక్ష హోదాలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయానికి కార్మికులు గేట్లు వేసి బైఠాయించడంతో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, ఉద్యోగులు, కౌన్సిలర్లు బయట ఉండిపోయారు. మున్సిపల్ చైర్మన్ మురళీను, ఉద్యోగులను, కౌన్సిలర్లను కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ వరకు తీసుకుని వెళ్లి విడిచి పెట్టేశారు. దీంతో కార్మికులు ర్యాలీగా శ్రీవేణుగోపాలస్వామి ఆలయం వరకు చేరుకుని నిరసన తెలిపారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిన రెగ్యులర్ చేయకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేసే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.











