- సెమీస్‌లో 2వ సీడ్ సబలెంకాపై సంచలన విజయం
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి చెక్ రిపబ్లిక్‌కు చెందిన 19వ సీడ్ కరోలినా ముఛోవా ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో ముఛోవా 2వ సీడ్ అర్యానా సబలెంకపై విజయం సాధించింది. పోటా పోటీగా సాగిన సెమీస్ పోటీలో ముఛోవా 7-6(7-5), 6-7(5-7), 7-5తో బెలారస్‌కు చెందిన సబలెంకను చిత్తుచేసింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో చేజిక్కించుకున్న ముఛోవా.. రెండో సెట్‌ను టైబ్రేక్‌లోనే ప్రత్యర్ధికి కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ముఛోవా ఓ దశలో 4-5 పాయింట్లతో వెనుకబడ్డా... ఆ తర్వాత వరుసగా మూడు గేమ్ పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ముగించింది. ముచోవా కెరీర్‌లో ఇది రెండో డబ్ల్యుటిఏ టూర్ ఫైనల్ మాత్రమే. 2019లో తొలిసారి అంతర్జాతీయ స్థాయి కొరియా ఓపెన్ టైటిల్‌ను గెలుచు కుంది. ముఛోవా 2013 నుంచి ప్రొఫె షనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా అవతరిం చింది. ముఛోవా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లడం ఇదే ప్రథమం. అంతకుముందు 2021ల ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌కు చేరగా.. 2019, 2021లో వింబుల్డన్ క్వార్టర్‌ఫైనల్ వరకు చేరుకోగలిగింది. శనివారం జరిగే ఫైనల్లో టాప్‌సీడ్ ఇగా స్వైటెక్, 14వ సీడ్ హడ్డాడ్ మలా మ్యాచ్ విజేతతో తలపడనుంది.
ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి నార్వేకు చెందిన 4వ సీడ్ రూఢ్ ప్రవేశించాడు. బుధవారం రాత్రి జరిగిన చివరి క్వార్టర్‌ఫైనల్ పోటీలో రూఢ్ 6-1, 6-2, 3-6, 6-3తో 6వ సీడ్ డెన్మార్క్‌కు చెందిన రూస్‌పై నెగ్గాడు.
నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్
అల్కరాజ్(1) × జకోవిచ్(3)
రూఢ్(4) × జ్వెరేవ్(22)
(బ్రాకెట్లలో సీడింగ్స్)










