Sep 13,2023 22:01
  • రాజమహేంద్రవరం సెరట్రల్‌ జైలులో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డిఐజి రవికిరణ్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో నిందితునిగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఆయన తరుఫు వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం కలిశారు. సెంట్రల్‌ జైలు వద్దకు మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన చేరుకున్నారు. చంద్రబాబు భద్రత రీత్యా కారును బయటే నిలిపేయాలని జైలు అధికారులు లూథ్రాకు సూచించారు. దీంతో, ఆయన కారును బయటే నిలిపి జైలులోకి నడుచుకుంటూ వెళ్లారు. 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్‌ అనంతరం బయటకు వచ్చారు. కోర్టులో బుధవారం జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణపై బాబుతో చర్చించినట్టు సమాచారం. మీడియాతో కూడా ఏమీ మాట్లాడకుండా రాజమహేంద్రంరలోని చంద్రబాబు కుటుంబ సభ్యుల వద్దకు లూథ్రా వెళ్లిపోయారు. ములాఖత్‌కు ముందు ఆయన వారిని కలిశారు.

జైలు వద్ద అదనపు భద్రత

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద పోలీసులను భద్రతను మరింత పెంచారు. సెంట్రల్‌ జైలు ప్రాంతంలో బారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. లూథ్రా వస్తున్న సమయంలో సెంట్రల్‌ జైలు ప్రాంతంలో రాకపోకలను కాసేపు నిలిపేశారు. జైలు లోపలా, బయటా సెక్యూరిటీ పెంచారు. అదనంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. జైలులో చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్యారక్‌ వద్ద కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌ సెంట్రల్‌ జైలులో భద్రతా ఏర్పాట్లను, చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్యారక్‌ను పరిశీలించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు అందుతున్న వసతులపై ఆరా తీశారు.

ఐదు ఛానల్స్‌ చూసేందుకు అవకాశం

సెంట్రల్‌ జైలు స్నేహ బ్యాకర్‌లో చంద్రబాబుకు కోర్టు ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఆయన గదిలో ఒక హాస్పిటల్‌ బెడ్‌, ఫ్యాన్‌, టివి ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ఐదు ఛానళ్లను చూసే అవకాశం కల్పించారు. న్యూస్‌ పేపర్లను అందుబాటులో ఉంచారు. స్నానానికి ప్రతిరోజూ రెండు బకెట్ల వేడి నీళ్లు అందిస్తున్న జైలు అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు ఇంటి నుంచి భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. భోజనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తరువాతే చంద్రబాబుకు అందజేస్తున్నారు.

టిడిపి ముఖ్యనేతలతో భువనేశ్వరి భేటీ

చంద్రబాబు భార్య భువనేశ్వరి తొలిసారి టిడిపి ముఖ్యనేతలతో బుధవారం రాజమహేంద్రవరంలోని విడిది గృహంలో భేటీ అయ్యారు. చంద్రబాబు కేసు పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం. పార్టీ పరిస్థితులతోపాటూ లీగల్‌గా ఏర్పడిన ఇబ్బందులను వారు భువనేశ్వరికి వివరించినట్టు తెలిసింది.

లోకేష్‌కు రజనీకాంత్‌ ఫోన్‌

చంద్రబాబు రిమాండ్‌ నేపథ్యంలో సినీనటుడు రజనీకాంత్‌ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఫోన్‌ చేశారు. ప్రస్తుత పరిణామాలపై ఆరా తీసినట్టు సమాచారం. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని, ఆయన ఎన్నడూ తప్పు చేయరని లోకేష్‌కు ధైర్యం చెప్పినట్టు తెలిసింది.

నేడు పవన్‌ ములాఖత్‌?

సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ములాఖత్‌ కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. అయితే, దీనిపై జైలు అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు.