Jun 17,2023 22:06

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాస్‌ ఖవాజా సెంచరీతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 14పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు కడపటి వార్తలందే సమయానికి 68ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 230పరుగులు చేసింది. ఓపెనర్‌ ఖవాజా సెంచరీకి తోడు గ్రీన్‌ అర్ధసెంచరీక చేరువలో ఉన్నాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ హెడ్‌(50) అర్ధసెంచరీ చేశాడు. వార్నర్‌(9), లబూషేన్‌(0), స్మిత్‌(16) తక్కువ స్కోర్‌కే పెవీలియన్‌కు చేరారు. బ్రాడ్‌, మొయిన్‌ అలీకి రెండేసి వికెట్లు దక్కాయి.
లబూషేన్‌ టెస్టుల్లో తొలిసారి గోల్డెన్‌ డక్‌
ఐసిసి టెస్ట్‌ బ్యాటర్స్‌ నంబర్‌ వన్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌ యాషెస్‌ సిరీస్‌లో తొలిసారి గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఐదేళ్ల తన టెస్టు కెరీర్‌లో లబూషేన్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరడం ఇదే మొదటిసారి. 2018లో పాకిస్థాన్‌పై లబూషేన్‌ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. రెండో రోజు తొలి సెషన్‌లో స్టువార్ట్‌ బ్రాడ్‌ ఆసీస్‌కు షాకిచ్చాడు. డేవిడ్‌ వార్నర్‌(9)ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత బంతికే లబూషేన్‌ కీపర్‌ బెయిర్‌స్టోకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, ఆసీస్‌ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఉస్మాన్‌ ఖవాజా(36), స్టీవ్‌ స్మిత్‌(15) ఆడుతున్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 330పరుగులు వెనకబడి ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌ యాషెస్‌ తొలి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మొదటి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్‌ చేశాడు. జో రూట్‌(118 నాటౌట్‌) సెంచరీ అనంతరం స్టోక్స్‌ అనూహ్యంగా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(12) తక్కువకే వెనుదిరిగినా మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే(61) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఓలీ పోప్‌(31), హ్యారీ బ్రూక్‌(31) త్వరగా పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో(78), రూట్‌తో కలిసి ధనాధన్‌ ఆడాడు.