- తొలుత ప్రారంభోత్సవ వేడుకలు
- అలరించనున్న రష్మిక, తమన్నా
- గుజరాత్ × చెన్నై మ్యాచ్‌తో షురూ..
- రాత్రి 6.00గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
అహ్మదాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) 2023 సీజన్-16 శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ప్రారంభం కానుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ తారలు రష్మిక, తమన్నా భాటియా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. నేడు ప్రారంభోత్సవ వేడుకలు జరగనుండగా.. ఇప్పటికే స్టేడియం వెలుపల డ్రోన్ షోలతో ఐపిఎల్ ట్రోఫీని మేఘాల్లో ఆవిష్కరించారు. గురువారం 10జట్ల కెప్టెన్లు కలిసి సీజన్-16 ఐపిఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.
తొలి మ్యాచ్‌కు కెప్టెన్‌గా భువనేశ్వర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌తో ఆడే తొలి మ్యాచ్‌కు కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరించనున్నాడు. ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ ఆదివారం హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇక సన్‌రైజర్స్ సారథి ఎయిడెన్ మార్కరమ్ దక్షిణాఫ్రికాలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడుతున్నందున తొలిమ్యాచ్ నాటికి జట్టులో చేరే అవకాశం లేదని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ గురువారం ట్విటర్‌లో పేర్కొంది. ఇక మయాంక్ అగర్వాల్ ట్విటర్ వేదికగా.. తమ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మర్‌క్రమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతనొక అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసలు కురిపించాడు. అంతేగాదు.. అతనొక రన్ మెషిన్. ఎందుకంటే..? అతను గేమ్ కోసం చాలా కష్టపడతాడు. అలాగే ఆటను మెరుగుపరుచుకునేందుకు బాగా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఏప్రిల్ 7న జరిగే మ్యాచ్ నాటికి మార్కరమ్ జట్టులో చేరనున్నట్లు వెల్లడించింది.










