కెన్నింగ్టన్ :వరుసగా రెండో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్. రెండేండ్ల క్రితం ఇదే పరిస్థితుల్లో గద వేటలో భంగపాటు నుంచి భారత్ పాఠాలు నేర్చుకోలేదు. 2021లో న్యూజిలాండ్‌తో ఫైనల్లో, 2023లో ఆస్ట్రేలియాతో తుది పోరులో టీమ్ ఇండియాను విజయానికి దూరం చేసింది బ్యాటర్లే!. కివీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులే చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడూ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు చేతులెత్తేసింది. తాజా టైటిల్ పోరులో బౌలర్ల వైఫల్యం సైతం కాస్త కనిపించినా.. ఓవరాల్‌గా రెండు ఐసీసీ టెస్టు ఫైనల్స్‌లో బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది.
ది ఓవల్‌లో టాస్ భారత్ వశం. ప్రణాళిల ప్రకారం తొలుత ఆసీస్ బ్యాటింగ్. బౌలర్లు రాణించగా 24.1 ఓవర్లలోనే 76/3తో కంగారూ శిబిరంలో ఒత్తిడి. ఇక్కడి వరకు బాగానే నడిచినా.. ఇక్కడ్నుంచే ఐసీసీ టెస్టు గద భారత్‌కు దూరమవుతూ వచ్చింది. ట్రావిశ్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) నాల్గో వికెట్‌కు 285 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి.. రోహిత్‌సేనను మానసికంగా వెనక్కి నెట్టారు. రిషబ్ పంత్ ప్రత్యర్థి జట్లకు ఇచ్చే ఝలక్ ది ఓవల్‌లో ట్రావిశ్ హెడ్ భారత్‌కు రుచి చూపించాడు. హెడ్, స్మిత్ భాగస్వామ్యాన్ని కట్టడి చేసి ఉంటే ఫలితం భిన్నంగా వచ్చేందుకు అవకాశాలు ఉండేవి. ఇక పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న సమయంలో టాప్ ఆర్డర్ కుప్పకూలటం కొంప ముంచింది. రోహిత్ (15), గిల్ (13), పుజార (14), కోహ్లి (14) పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. 91/1తో మెరుగ్గా సాగుతున్న దశలో రోహిత్, పుజార వికెట్లతో భారత్‌పై ఒత్తిడికి అధికమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 285 పరుగుల నాల్గో వికెట్ భాగస్వామ్యం ఆ జట్టును ఐసీసీ ప్రపంచ టెస్టు విజేతగా నిలుపగా.. బ్యాటర్ల సమిష్టి వైఫల్యం భారత్‌ను వరుసగా రెండోసారి రన్నరప్‌గా నిలిపింది.










