ఢిల్లీ: గత ఏడాది 'బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల'లోకి పెట్టుబడులు 90 శాతానికి పైగా తగ్గాయి. 2022లో మదుపర్లు కేవలం రూ. 459 కోట్లు మాత్రమే గోల్డ్ ఈటీఎఫ్‌లలో మదుపు చేశారు. పసిడి ధరలు పెరగడం, వడ్డీరేట్లు ఎగబాకడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే అందుకు కారణం. 'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం 2021లో రూ. 4,814 కోట్లు, 2020లో రూ. 6,657 కోట్లు బంగారం ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి.
మరోవైపు ఈటీఎఫ్‌లతో పోలిస్తే ప్రభుత్వ పసిడి బాండ్లపై ప్రచారం ఎక్కువగా జరుగుతోందని ఫెల్లో సీఈఓ మనీశ్ మర్యాడా తెలిపారు. పసిడి ఈటీఎఫ్‌లతో పోలిస్తే బాండ్లలో అధిక పన్ను ప్రయోజనాలు ఉండడమే అందుకు కారణమన్నారు. ఎక్స్ఛేంజ్ ఫండ్లలోకి కూడా పెట్టుబడులు పెరగాలంటే దీర్ఘకాల మూలధన లాభాల పన్నును తగ్గించడం వంటి పన్ను ప్రయోజనాలు కల్పించాలని కోరారు. సాధారణంగా మదుపర్లు బంగారాన్ని దీర్ఘకాల లక్ష్యంతో కొంటారని గుర్తుచేశారు. అందుకే పన్ను మినహాయింపులు కల్పిస్తే పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు.
క్రితం ఏడాదితో పోలిస్తే 2022లో గోల్డ్ ఈటీఎఫ్ మదుపర్ల ఖాతాల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. దేశీయంగా చూస్తే 2022లో మదుపర్లు ఇతర మదుపు సాధనాలతో పోలిస్తే ఈక్విటీల్లోకి అత్యధిక పెట్టుడులు మళ్లించారు. ఈ సెగ్మెంట్‌లోకి 2021లో రూ.96,700 కోట్లు మదుపు చేయగా.. గత ఏడాది అది రూ. 1.6 లక్షల కోట్లకు చేరాయి. క్రమానుగత పెట్టుబడుల్లోకీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.
గత ఏడాదిలో పసిడి ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ 16 శాతం పెరిగి రూ. 21,455 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇవి రూ. 18,405 కోట్లుగా ఉన్నాయి. ఈ ఈటీఎఫ్ ఖాతాల సంఖ్య 14.29 శాతం పెరిగి 46.28 లక్షలకు ఎగబాకాయి. ఒకవేళ ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగితే గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి మదుపు పెరిగే అవకాశం ఉందని నియో బ్యాంక్ స్ట్రాటజీ విభాగాధిపతి స్వప్నిల్ భాస్కర్ తెలిపారు.










