విజయవాడ: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల సందర్భంగా రోజుకు లక్షా 70 వేల మంది దుర్గమ్మను దర్శించుకునే ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రతి సెకనుకు ఇద్దరు, ముగ్గురు యాత్రికులు దర్శించుకోవచ్చని వెల్లడించారు. రోజుకు 4 గంటలు పూజలు, నివేదనలు, 20 గంటలపాటు యాత్రికుల దర్శనాలు ఉంటాయన్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రొటోకాల్ ఉన్నవారు స్వయంగా వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.అక్టోబర్ 15న ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. 23న విజయదశమి రోజున 10.30 గంటలకు పూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో యాత్రికులకు దర్శనమిస్తారు. మొదటి రోజైన ఆదివారం.. స్నాపనభిషేకం అనంతరం అమ్మవారి ప్రత్యేక దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆరోజున బాలాత్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. 16న గాయత్రీ దేవిగా, 17న అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇక నవరాత్రుల్లో నాలుగో రోజైన 18వ తేదీన మహాలక్ష్మి దేవిగా, 19న లలితా త్రిపుర సుందరి దేవిగా కొలువుదీరనున్నారు. నవరాత్రుల్లో ఆరో రోజు అక్టోబర్ 20న మూలా నక్షత్రంలో దుర్గమ్మ సరస్వతి దేవిగా, 21న కనకదుర్గ దేవిగా, 22న మహిషాశుర మర్దినిగా, నవరాత్రుల్లో చివరి రోజు 23న రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు.a










