Apr 02,2023 10:28

ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్‌ పేసర్‌, కేకేఆర్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌, ఢిల్లీ కేపిటల్స్‌ సీమర్‌ ఖలీల్‌ అహ్మద్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. ఉమేశ్‌ ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టగా, ఖలీల్‌ అహ్మద్‌ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌.. ఈ అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్‌ యాదవ్‌ 34 వికెట్లు పడగొట్టాడు. కాగా గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబైపై అత్యధికంగా 33 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును ఉమేశ్‌ యాదవ్‌ బ్రేక్‌ చేశాడు.
ఖలీల్‌ తన 35వ మ్యాచ్‌లోనే 50వ వికెట్‌ పడగొట్టాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అమిత్‌ మిశ్రా పేరున ఉంది. అమిత్‌ 37 మ్యాచుల్లో 50 వికెట్లు పడగొట్టగా, ఖలీల్‌ రెండు మ్యాచ్‌ల ముందే ఆ ఘనత అందుకున్నాడు. మార్కస్‌ స్టోయినిస్‌, నికోల్‌ పూరన్‌ వికెట్లను తీసుకోవడం ద్వారా ఖలీల్‌ ఈ ఘనత అందుకున్నాడు. ఇక, ఓవరాల్‌గా చూసుకుంటే దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ పేరున ఉంది. రబడ 27 మ్యాచుల్లోనే 50 వికెట్లు తీసుకున్నాడు. ఖలీల్‌ అహ్మద్‌ 2016, 2017లో ఢిల్లీ జట్టులో ఉన్నప్పటికీ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు.