నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రష్మిక, తమన్నా భాటియా స్టేజ్‌పై చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రారంభోత్సవ వేడులకు ప్రధాన ఆకర్షణగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక, తమన్నా నిలిచారు. తెలుగు, తమిళ్, హిందీ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు అందుకున్న 'నాటు.. నాటు..' పాటతో స్టేడియం హోరెత్తిపోయింది. తొలిసారి నాలుగు తెలుగు సినిమా పాటలు ఐపిఎల్ స్టేజిపై వినిపించాయి. ఇక రష్మిక తాను నటించిన 'పుష్ప' సినిమాలోని మూడు పాటలకు డ్యాన్స్ వేసింది. చివర్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు పర్ఫెక్ట్‌గా స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. గోల్డ్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో రష్మిక, సిల్వర్ కలర్ డ్రెస్‌లో తమన్నా స్టేజ్‌పై నృత్యాలు చేశారు. అలాగే హిందీ ప్రముఖ నేపథ్య గాయకుడు అరిజిత్ సింగ్ 'ఐ మేరే వతన్', 'లెహ్రా దో', 'వందే మాతరం' పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలు పాడారు. అరిజిత్ పాడిన పాటలకు ప్రేక్షకులు ఆయనతో పాటు లయ అందుకోవడం విశేషం. సుమారు లక్షా 30వేల సామర్థ్యంగల నరేంద్ర మోడీ స్టేడియం తొలిసారి పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయింది. నాలుగేళ్ల తర్వాత బిసిసిఐ మళ్లీ ప్రారంభోత్సవ వేడులను నిర్వహించారు.










