Sep 11,2023 22:55
  • ప్రధాన వీధుల్లో పోలీసుల పహరా

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైల్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు జైలు ప్రధాన వీధిలో రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసి అనుమానితుల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నగరంలో బంద్‌ పాక్షికంగా జరిగింది. రాజమహేద్రవరంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మధ్యాహ్నం వరకూ రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. బంద్‌ పేరుతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. ప్రధాన వీధుల్లో పోలీసుల పహరా కొనసాగించారు. రాజమహేంద్రవరంలో నారా లోకేష్‌ బస చేసిన విడిది ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఆంక్షలు విధించి బారికేడ్లతో ట్రాఫిక్‌ మళ్లించారు.

తొలిరోజు జైలు జీవితం గడిచిన చంద్రబాబు

చంద్రబాబు జైలు జీవితం తొలి రోజైన సోమవారం ఇంటి నుంచే అల్పాహారం, ఫ్రూట్‌ సలాడ్‌ అందజేశారు. చంద్రబాబుకు ఇంటి భోజనానికి న్యాయం స్థానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం ఫ్రూట్‌ సలాడ్‌తో పాటు వేడి నీళ్లు, బ్లాక్‌ కాఫీని కుటుంబ సభ్యులు పంపారు. మధ్యాహ్నం 100 గ్రాముల బ్రౌన్‌ రైస్‌, బెండకాయ వేపుడు, పన్నీర్‌ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటలకు టీ తాగేందుకు వేడి నీళ్లు అందించారు. సోమవారం 4 గంటలకు నిద్రలేచిన చంద్రబాబు కొద్ది సేపు యోగా చేశారు. అనంతరం ఆయన ఇంటి నుంచి వ్యక్తిగత సిబ్బంది అల్పాహారంతో పాటు మెడిసిన్స్‌ తీసుకొచ్చారు. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం రీత్యా ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో ప్రత్యేక గదిని అందుబాటులో ఉంచినట్టు సమాచారం. ఇదే జైలులో కరుడు గట్టిన నేరస్తులు ఉండటంతో చంద్రబాబు రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

1

నేడు కుటుంబ సభ్యుల ములాఖత్‌కు అనుమతి

చంబ్రాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్‌లకు మంగళవారం ములాఖత్‌కు అవకాశం కల్పించారు. తొలిరోజు ములాఖత్‌కు కోరినప్పటికీ అధికారులు అనుమతించలేదు. ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరానికి చేరుకున్నారు.