Sep 14,2023 20:05

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్‌ వెల్లడించారు. జైలు క్వార్టర్స్‌ నుంచి రాహుల్‌ భార్యను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన భద్రతపై కుటుంబ సభ్యులతో పాటు టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జైలు సూపరింటెండెంట్‌ను మారుస్తారని గత కొన్ని రోజులుగా తెదేపా నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.