రాజమహేంద్రవరం: మహిళ అదృశ్యం కేసులో ఇటీవల విచారణ ఎదుర్కొని ఆస్పత్రి పాలైన ఎస్సీ యువకుడు వడ్డి వెంకటప్రసాద్ డిశ్ఛార్జి అయ్యాడు. కడియం ఎస్సై తనను తీవ్రంగా కొట్టి, దుర్భాషలాడారని ఎస్సీ యువకుడు వెంకటప్రసాద్ ఆరోపించారు. మంచినీరు అడిగితే మూత్రం తాగమన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీకి వచ్చేందుకు ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారన్న బాధితుడి భార్య శిరీష.. తన భర్తను చిత్రహింసలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కడియం మండలంలో ఇటీవల ఓ మహిళ అదృశ్యమైందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో చాగల్లు మండలం కుంకుడుపల్లికి చెందిన వెంకటప్రసాద్ సహకరించాడనే అభియోగంతో అతడిని కడియం పోలీసులు ఈనెల 17న సాయంత్రం విచారణ నిమిత్తం పిలిచారు. అయితే విచారణ పేరిట కడియం పోలీసులు హింసించారని అతని కుటుంబసభ్యులు చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం హల్‌చల్ చేశాయి. అయితే, ఆ యువకుడిపై పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించలేదని రాజమహేంద్రవరం దక్షిణ మండల డీఎస్పీ కె.శ్రీనివాసులు వివరణ ఇచ్చారు.










