Nov 10,2022 21:09

చమురు కంపెనీల నిర్ణయం
డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు

హైదరాబాద్‌ : హోటళ్లలో అహారం మరింత ప్రియం కానుంది. ఇప్పటి వరకు ఎల్‌పిజి వాణిజ్య సిలిండర్లపై డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న రాయితీలకు మంగళం పాడాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు, స్ట్రీట్‌ వెండర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలపై భారం పడనుంది. చమురు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రాయితీని ఎత్తివేస్తూ చమురు కంపెనీలు నవంబర్‌ 7న మధ్యరాత్రి నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తమకు సమాచారం ఇచ్చారని తెలంగాణ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ (టిఎల్‌డిఎ) అధ్యక్షుడు కె జగన్‌ మోహన్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీ జువ్వడి శ్రీ చరన్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. పంపిణీదారులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయన్నారు. ముందస్తుగా చెప్పి కొంత వెసులుబాటు కల్పించాల్సిందన్నారు. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1945గా ఉందన్నారు. ఇది వరకు వినియోగదారుల వాడకం స్థాయి, నగదును బట్టి రూ.100 నుంచి రూ.200 వరకు రాయితీ ఇచ్చే వారమని తెలిపారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదన్నారు. అదే విధంగా ఇకపై అరువు కూడా ఇవ్వలేమన్నారు. హైదరాబాద్‌లో నెలకు 8 లక్షల వాణిజ్య సిలిండర్ల వాడకం ఉందన్నారు. వినియోగదారులు పాత బకాయిలు చెల్లించడంతో పాటుగా ఇకపై ఎప్పటికప్పుడు నగదు చెల్లించాలని వారు కోరారు. ఈ సమావేశంలో టిఎల్‌డిఎ సభ్యులు వెంకట్‌ రావు, అశోక్‌ పాల్గొన్నారు.