హైదరాబాద్: వరదల వల్ల ఇండ్లు కూలిన వారికి 'గృహలక్ష్మి' ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆపత్కాలంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా చాలా కృషి చేశారన్నారు. భారీ వరదల్లో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సిబ్బంది పనులు చేశారని తెలిపారు. మిషన్ భగీరథ సిబ్బంది కూడా చాలా వేగంగా నీటి సరఫరాను పునరుద్ధరించారని చెప్పారు. స్వల్పకాలిక చర్చలో భాగంగా అసెంబ్లీలో భారీ వర్షాలు, వరదలు ప్రభావంపై చర్చ అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వరదల్లో 1500 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించామన్నారు. 770 నివాసాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. 139 గ్రామాల్లో వరదల నష్టం ఎక్కువ జరిగిందని మంత్రి అన్నారు. 419 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయని, 7500 ఇండ్లు పాక్షికంగా కూలియాన్నారు. వరదల వల్ల ఇల్లు కూలిన వారికి గఅహలక్ష్మి పథకం ఆర్థికసాయం అందిస్తామన్నారు. కేంద్రప్రభుత్వ సహాయంకోసం ఎన్నడూ ఎదురు చూడలేదని చెప్పారు. కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు.గత మూడేండ్లుగా జీహెచ్‌ఎంసీలో వరదల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి వల్ల రోడ్ల నష్టం తగ్గుతున్నదని వెల్లడించారు. నాలాల అభివృద్ధివల్ల జీహెచ్‌ఎంసీలోనూ నష్టం తగ్గించగలిగామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి చేపట్టిన చర్యల వల్ల నష్ట తీవ్రత తగ్గుతున్నదని చెప్పారు.










