Jun 08,2023 06:29
  • వరద ప్రవాహానికి క్రమేణా దెబ్బతింటున్న అప్రాన్‌
  • అత్యవసరంగా పనులు చేపట్టాలని నిపుణుల హెచ్చరిక
  • రూ.12.91 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఆమోదం తెలపని ప్రభుత్వం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద వంశధారపై నిర్మించిన గొట్టాబ్యారేజీకి ముప్పు పొంచి ఉందని ఇంజనీరింగ్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మరమ్మతుకు నిధుల మంజూరులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. కడప జిల్లాలో 2021 నవంబర్‌ 19న అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో ప్రభుత్వం... రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీల భద్రతపై 11 మంది సభ్యులతో ఇంజనీరింగ్‌, సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. గతేడాది జులై ఏడున ఈ కమిటీ బ్యారేజీని సందర్శించి పలు సూచనలు చేసింది. వరదల వల్ల దెబ్బతిన్న అప్రాన్‌ పనులు అత్యవసర రక్షణ చర్యలుగా పరిగణించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించింది. బ్యారేజీకి సంబంధించి అప్పటికే వంశధార అధికారులు 2021-22 రేట్లతో రూ.12.91 కోట్ల అంచనా వ్యయంతో 2021 ఫిబ్రవరిలో ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఇప్పటి వరకూ ఉలుకు పలుకు లేదు. ఆగస్టులో వంశధార వరదలకు బ్యారేజీ దిగువ భాగాన ఉన్న గట్టు కోతకు గురవడంతో రూ.10 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అప్రాన్‌, వరద గట్ల పటిష్టానికి నిధుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. హిరమండలం మండలం గొట్టాబ్యారేజీ వద్ద 0.612 టిఎంసిల సామర్థ్యంతో 1977లో బ్యారేజీ, ఎగువ భాగంలో ఎడమవైపున 3.6 కిలోమీటర్లు, కుడివైపున 6.2 కిలోమీటర్ల మేర వరదకట్ట, బ్యారేజీకి ఆనుకుని దిగువ, ఎగువ భాగంలో 11.06 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ బ్లాక్‌లతో అప్రాన్‌ నిర్మించారు. దీనికి సపోర్టుగా పెద్దపెద్ద బండరాళ్లను కట్టగా పేర్చారు. 2008, 2010 ఆగస్టులో వచ్చిన వరదల వల్ల అప్రాన్‌ క్రమేణా దెబ్బతింటోంది. బ్యారేజీ దిగువ భాగంలో తాత్కాలికంగా మూడు మీటర్ల మేర రాళ్లను వేశారు. బ్యారేజీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో 2012 మార్చి 26న రూ.3.48 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2014లో మరమ్మతులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వరదలకు మరోసారి బండరాళ్లు కొట్టుకుపోయాయి. 2015లో హైదరాబాద్‌ నుంచి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వచ్చిన చీఫ్‌ ఇంజనీరు సర్వే చేసి, అదే ఏడాది మేలో తనిఖీ నివేదిక సమర్పించారు. బ్యారేజీ దిగువ భాగంలో అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారుల ప్రతిపాదనలను పరిశీలించిన అప్పటి ప్రభుత్వం రూ.9.72 కోట్లు కేటాయిస్తూ, 2017 ఫిబ్రవరి ఏడున ఉత్తర్వులు ఇచ్చింది. అప్పట్నుంచీ పనులు చేపట్టకుండా పాలకులు నాన్చుతూ వచ్చారు. 2021-22 ధరల ప్రకారం దాని వ్యయం రూ.12.91 కోట్లకు చేరింది. ప్రస్తుత ధరలకనుగుణంగా వ్యయాన్ని లెక్కిస్తే, మరో రూ.కోటి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.