Jun 10,2023 07:51
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 296ఆలౌట్‌
  • రహానే, శార్దూల్‌ అర్ధసెంచరీలు
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 123/4

లండన్‌ : ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 151పరుగులతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ ను కొనసాగించిన భారతజట్టు 296పరుగు లకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌(5) త్వరగా పెవీలియన్‌కు చేరినా.. సీనియర్‌ బ్యాటర్‌ అజింక్యా రహానే, శార్దూల్‌ ఠాకూర్‌ అర్ధసెంచరీలతో కదం తొక్కారు. రహానే(89), శార్దూల్‌ 51 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ నిరాశపరచడంతో భారత ఇన్నింగ్స్‌ 296పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 173పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. కమిన్స్‌కు మూడు, బోలండ్‌, గ్రీన్‌, స్టార్‌కు రెండేసి, లియాన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 123పరుగులు చేసింది. ఓపెనర్‌ ఖవాజా(13), వార్నర్‌(1) త్వరగా ఔటైనా.. లబూషేన్‌(41నాటౌట్‌), స్టీవ్‌ స్మిత్‌(34) ఆదుకున్నారు. స్టీవ్‌ స్మిత్‌, హెడ్‌లను రవీంద్ర జడేజా ఔట్‌ చేశాడు. జడేజాకు రెండు, సిరాజ్‌, ఉమేశ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పటికే 296పరుగుల ఆధిక్యతలో ఉంది.
 

                                                             ఆదుకున్న రహానే, శార్దూల్‌....

152 పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను అజింక్య రహానే- శార్దూల్‌ ఠాకూర్‌ కలిసి ఆదుకున్నారు. రహానే 129 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేయగా.. శార్థూల్‌ ఠాకూర్‌ 109 బంతుల్లో 6 ఫోర్‌ల సాయంతో 51 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్‌కు 109పరుగులు జతచేశారు. అజింక్యా రహానే ఔటయ్యే సమయానికి భారతజట్టు 261పరుగులు చేసి ఫాల్‌ ఆన్‌ గండం నుంచి గట్టెక్కేందుకు మరో 8పరుగుల దూరంలో నిలిచింది. చివర్లో ఉమేశ్‌ యాదవ్‌(5), షమీ(13) కూడా నిరాశపరిచారు.
 

                                                       రహానే టెస్టుల్లో 5వేల పరుగులు పూర్తి

టీమిండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్యా రహానే టెస్టుల్లో 5వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. ఆ మార్క్‌ను అందుకున్న 13వ బ్యాటర్‌గా నిలిచాడు. కెరీర్‌లో 83వ టెస్టు ఆడుతున్న రహానే.. 12సెంచరీలు, 25 అర్ధసెంచరీలు చేశాడు. డబ్ల్యుటిసి ఫైనల్లో 92బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసిన రహానే.. మొత్తం 129బంతులు ఎదుర్కొని 11ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.
 

స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 469ఆలౌట్‌
ఇండియా తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (ఎల్‌బి) కమిన్స్‌ 15, శుభ్‌మన్‌ (బి)బోలాండ్‌ 13, పుజారా (బి)గ్రీన్‌ 14, కోహ్లి (సి)స్మిత్‌ (బి)స్టార్క్‌ 14, రహానే (సి)గ్రీన్‌ (బి)కమిన్స్‌ 89, జడేజా (సి)స్మిత్‌ (బి)లియాన్‌ 48, శ్రీకర్‌ భరత్‌ (బి)బోలండ్‌ 5, శార్దూల్‌ (సి)క్యారీ (బి)గ్రీన్‌ 51, ఉమేశ్‌ (బి)కమిన్స్‌ 5, షమీ (సి)క్యారీ (బి)స్టార్క్‌ 13, సిరాజ్‌ (నాటౌట్‌) 0, అదనం 29. (69.4ఓవర్లలో ఆలౌట్‌) 296పరుగు లు. వికెట్ల పతనం: 1/30, 2/30, 3/50, 4/71, 5/142, 6/152. 7/261, 8/271, 9/294, 10/296 బౌలింగ్‌: స్టార్క్‌ 13.4-0- 71-2, కమిన్స్‌ 20-2-83-3, బోలండ్‌ 20-6-58-2, గ్రీన్‌ 12-1-44-2, లియాన్‌ 4-0-19-1.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: ఖవాజా (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)ఉమేశ్‌ 13, వార్నర్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)సిరాజ్‌ 1, లబూషేన్‌ (బ్యాటింగ్‌) 41, స్మిత్‌ (సి)శార్దూల్‌ (బి)జడేజా 34, హెడ్‌ (సి అండ్‌ బి)జడేజా 18, గ్రీన్‌ (బ్యాటింగ్‌) 7, అదనం 9. (44ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 123 పరుగులు.
వికెట్ల పతనం : 1/2, 2/24, 3/86, 4/111
బౌలింగ్‌ : షమీ 10-4-17-0, సిరాజ్‌ 12-2-41-1, శార్దూల్‌ 6-1-13-0, ఉమేశ్‌ 7-1-21-1, జడేజా 9-3-25-2.