Aug 24,2023 08:39
  •  నేటి నుంచి మండల కేంద్రాల్లో రిలే దీక్షలు
  •  గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పంచాయతీ, స్వచ్ఛభారత్‌ క్లాప్‌మిత్ర కార్మికుల వేతనాలపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరు అసత్య ప్రకటనలు మానుకోవాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధుల నుంచి వేతనాలు చెల్లిస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరు ప్రకటన అవాస్తవమని యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి వెంకట్రామయ్య, ఎన్‌ నూర్‌మహ్మద్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా డిపిఒ అధికారుల నుంచి గ్రామ పంచాయతీలలో అధికారుల వరకూ ఎటువంటి కదలిక లేదని, బుధవారం కూడా అనేక జిల్లాల్లో కార్మికులు ఆందోళనలో ఉన్నారని వివరించారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం కార్మికులు ఆందోళన నిర్వహించారని వివరించారు. ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పంచాయతీ కార్మికులు ప్రతిరోజూ నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. 15 రోజులుగా ప్రభుత్వం, అధికారుల ప్రకటనలు తప్ప కార్మికులకు వేతనాలు అందడం లేదని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2022 అక్టోబరు నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా కమిషనర్‌ సూర్యకుమారి ఒక ప్రకటనలో అంగీకరించారని పేర్కొన్నారు. వేతనాలు పది నెలలు నుంచి పెండింగ్‌లో ఉంటే ఎలా జీవించాలని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో కార్మికుల వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు సిఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, హామీల అమలుకు ఈ నెల 24 నుంచి 26 వరకు మండల కేంద్రాల్లో రిలే దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్దయెత్తున పాల్గొని నిరసనలు తెలపాలని కోరారు.

నేడు మున్సిపల్‌ కార్మికుల మహాధర్నా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ మున్సిపల్‌ కార్మికులకు విజ్ఞప్తి చేసింది. విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఈ కార్యక్రమం జరగనుందని ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నాగభూషణ, కె ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తామని, సిపిఎస్‌ రద్దు తదితర హామీలను నాలుగున్నరేళ్లుగా అమలు చేయడం లేదని అన్నారు.