Aug 07,2023 16:01

ప్రజాశక్తి కాకినాడ : మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు 010 పద్దు క్రింద వేతనాలు చెల్లించి, టైంస్కేల్‌ వర్తింపచెయ్యాలని, అప్పటి వరకు కనీసవేతనం 26వేలు చెల్లించాలని, సమాన పనికి, సమాన వేతనం, అమలుచేయాలని, మున్సిపల్‌ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్ద్‌, సెమీస్కిల్‌, అన్‌ స్కిల్డ్‌ వేతనాలు చెల్లించి, రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, క్లాప్‌ ఆటోడ్రైవర్లకు నెలకు రూ.18,500ల జీతం ఇవ్వాలని, రక్షణ, భద్రతా సౌకర్యాలు పనిముట్లు సకాలంలో అందించాలని కోరుతూ సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్‌ చేస్తానని, అధికారంలోకి రాగానే మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి 4ఏళ్ళు గడుస్తున్నా ఏ ఒక సమస్య పరిష్కారం చేయలేదని, ఇచ్చే హెల్త్‌ ఎలవన్స్‌ కూడా నెలలు తరబడి పెండింగ్‌ పెడుతున్నారని, విధి నిర్వహణలో కార్మికుడు చనిపోతే జీవో నెంబర్‌ 25 ప్రకారం పరిహారం చెల్లించాలన్న ఉత్తర్వులను ఏ మున్సిపాలిటీలో కూడా అమలు జరగడం లేదని, తుని, గొల్లప్రోలు, పెద్దాపురం, ఏలేశ్వరం, కాకినాడ మున్సిపాలిటీలలో కార్మికుల కుటుంబాలు పరిహారాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని విమర్శించారు. క్లాప్‌ డ్రైవర్లకు ప్రభుత్వ సెలవులు ఇవ్వకుండా బానిస చాకిరీ చేయించుకుంటున్నారని ఇచ్చే తొమ్మిది వేల వేతనంతో కార్మికుని కుటుంబం ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే భారీ పోరాటాలకు సిద్ధపడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో లీలపు ఏసమ్మ, చెల్లి వెంకటరమణ, బంగారు సత్యవతి, చెక్క అప్పారావు, బోడపాటి నూకరాజు, మేడపాటి కిషోర్‌, బర్రె కొండబాబు, తుమ్మలపల్లి శాంతకుమారి, అల్లి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.