దోపిడీ కోసమే విద్యుత్ సవరణ బిల్లు - ఎపి పవర్ ఎంప్లాయీస్ జెఎసి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో :పెట్టుబడిదారులు దోపిడీ చేసుకోవడానికి వీలుగా పార్లమెంట్‌లో విద్యుత్ సవరణ బిల్లు - 2022ను కేంద్రం ప్రవేశపెట్టి చట్టంగా మార్చుకోవడానికి చూస్తోందని, మోడీ సర్కారు దూకుడుకు ఐక్య పోరాటాలతో కళ్లెం వేయాల్సిన అవసరముందని పలువురు వక్తలు అన్నారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎపి పవర్ ఎంప్లాయీస్ జెఎసి ఆధ్వర్యాన గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎఐపిఇఎఫ్ చైర్మన్ శైలేంద్ర దుబే మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లును అప్రజాస్వామికంగా, ఓ నియంతలా ప్రధాని మోడీ పార్లమెంట్‌లో పెట్టారని మండిపడ్డారు. దేశంలోని నాలుగు దిక్కుల నుంచీ త్వరలో 'బిజిలీ క్రాంతి యాత్ర'ను పార్లమెంట్ వరకూ చేపట్టి ప్రభుత్వ రంగంపై సాగించే మోడీ దాడిని తిప్పికొడతామన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాటాల సెగ ఎగసిపడి ఢిల్లీని తాకాలని కోరారు. ఇటీవల సాగిన రైతు ఉద్యమం స్ఫూర్తి కావాలన్నారు. విద్యుత్ సవరణ బిలుపై దేశ వ్యాపిత పోరాటానికి విశాఖ కేంద్రంగా శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యుపిఎస్‌సి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కెఎస్.చలం మాట్లాడుతూ దేశంలో డబ్ల్యుటిఒ వల్ల వ్యవసాయ రంగం కుదేలైందని, పెట్టుబడిదారులు అన్ని రంగాల్లోకి జరబడి దేశాన్ని లూటీ చేశారని తెలిపారు. విద్యుత్ చట్ట సవరణతో ఛార్జీలు తగ్గిపోతాయనే ప్రచారం మోసపూరితమైందన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సంస్కరణలతో ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. దేశంలో రైతులకు గిట్టుబాటు ధరలే రావడం లేదని.. అలాంటప్పుడు రైతులు విద్యుత్‌ను ఎలా కొనగలరని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఎపిఎస్‌పిఇ జెఎసి చైర్మన్ గణపతి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ విసి జార్జి విక్టర్ పాల్గొన్నారు.










