Mar 29,2023 10:30
  • బ్యాటర్‌గానే బెన్‌ స్టోక్స్‌ సేవలు.. బట్లర్‌ రాకతో రాజస్తాన్‌ ఖుషీ..

చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(2023) మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు లీగ్‌లో ఆడేందుకు ఒక్కొక్కరుగా ఆయా ఫ్రాంచైజీలకు చేరుకుంటుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జట్టు ఆటగాళ్లతో జతకట్టాడు. అలాగే మంగళవారం కొంతసేపు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను ఆ ఫ్రాంచైజీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా అయిన ధోనీ గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో ఐపిఎల్‌కు గుడ్‌బై పలకడమే తరువాయి అనుకున్న తరుణంలో ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టి మైదానంలోకి దిగడం గమనార్హం. ఇక చెన్నై జట్టు తన లీగ్‌ మ్యాచ్‌ను మార్చి 31న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చపాక్‌ స్టేడియంలో తలపడనుంది. 41ఏళ్ల ధోనీ ఈ సీజన్‌ ఐపిఎల్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచిచూడాల్సి ఉంది.
 

                                                                     చెన్నైకు ఎదురుదెబ్బ..

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభంకానుండగా ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ మోకాలి సమస్యతో బాధపడుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో స్టోక్స్‌.. ఐపిఎల్‌ 16వ ఎడిషన్‌లో ప్రారంభ మ్యాచ్‌లకు కేవలం బ్యాటర్‌గానే సేవలందిస్తాడని, ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ మంగళవారం ప్రకటించారు. స్టోక్స్‌ గాయంనుంచి పూర్తిగా కోలుకుంటే బౌలర్‌గా సేవలందిస్తాడని హస్సీ పేర్కొన్నాడు. బెన్‌ స్టోక్స్‌ను చెన్నై రూ. 16.25 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
 

                                                                బట్లర్‌ చేరికతో రాజస్తాన్‌ ఖుషీ..

ఇంగ్లండ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ భారత్‌ చేరుకున్నాడు. అతడు ఇండియాకు వచ్చిన వీడియోను రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో బట్లర్‌.. 'యుజీ(యజువేంద్ర చాహల్‌) ఎక్కడీ' అని అంటాడు. 15వ సీజన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బట్లర్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రాజస్థాన్‌ను ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడు. 17మ్యాచుల్లో 863పరుగులు చేసి ఆ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఆ సీజన్‌లో బట్లర్‌ నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు బాదాడు. 149.05 స్ట్రయిక్‌ రేటుతో రాజస్తాన్‌ జట్టు ఫైనల్‌ చేరడంలో బట్లర్‌ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో రాజస్తాన్‌ జట్టు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.